DC v SRH: నట్టూ నువ్ సూపర్.. డెత్ ఓవర్ బౌలింగ్ అంటే ఇదే కదా: బ్రెట్ లీ

దుబాయ్: లీగ్‌లోనే అత్యుత్తమ బౌలింగ్ దళం అనే పేరును కాపాడుకుంటూ.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2020లో ఖాతా తెరిచింది. మంగళవారం షేక్ జాయెద్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 15 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన వార్నర్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 162 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో తడబడ్డ ఢిల్లీ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 147 పరుగులకే పరిమితమైంది. సన్‌రైజర్స్ విజయంలో తంగరసు నటరాజన్ కీలక పాత్ర పోషించాడు. నాలుగు ఓవర్లు వేసిన ఈ తమిళనాడు పేసర్ కేవలం 25 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు.

డెత్ ఓవర్ బౌలింగ్ అంటే ఇదే
డిల్లీతో జరిగిన మ్యాచ్‌లో నటరాజన్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో మాజీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నట్టూను ఆస్ట్రేలియా పేస్ దిగ్గజం బ్రెట్ లీ పొగడ్తలతో ముంచెత్తాడు. 'డెత్ ఓవర్లలో బౌలింగ్ వేయాల్సిన విధానం ఇదే కదా. నటరాజన్ నీ బౌలింగ్ అద్భుతం. నువ్ సూపర్' అని బ్రెట్ లీ ట్వీట్ చేశాడు. భారత మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ కూడా నటరాజన్ ప్రదర్శనను మెచ్చుకున్నాడు. 'నటరాజన్ చాలా బాగా యార్కర్లు వేశావు. నీ ప్రదర్శన ఎంతో ఆనందం కలిగించింది' అని అన్నాడు.

4 ఓవర్లు.. 25 పరుగలు
తన కోటా నాలుగు ఓవర్లు వేసిన నటరాజన్ 25 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో కీలకమైన 18వ ఓవర్‌లో నటరాజన్ బాగా బౌలింగ్ చేశాడు. ఆ సమయంలో ఢిల్లీకి 18 బంతుల్లో 44 పరుగులు అవసరం. క్రీజులో హిట్టర్ మార్కస్ స్టొయినీస్ ఉన్నాడు. టోర్నీలో ఇప్పటికే స్టొయినీస్ ఓ హాఫ్ సెంచరీ చేసి మంచి ఫామ్‌లో ఉన్నాడు. దీంతో నటరాజన్‌కు కష్టాలు తప్పవనే అనుకున్నారు. కానీ కష్టతరమైన యార్కర్ బంతులు వేసిన నటరాజన్.. బ్యాట్స్‌మన్‌ను తిప్పలు పెట్టాడు. ఆ ఓవర్‌లో కేవలం 7 పరుగులే ఇచ్చాడు. ఇక చివరి బంతికి స్టొయినీస్‌ను ఎల్బీగా ఔట్ చేశాడు.

12 బంతుల్లో 10 యార్కర్లు
మొదటి రెండు ఓవర్లు బాగా వేసిన నటరాజన్.. 14, 18వ ఓవర్లలో తన సత్తా ఏంటో ప్రపంచానికి చూపదు. వేసిన 12 బంతుల్లో దాదాపు 10 యార్కర్లే ఉండడం విశేషం. లైన్ అండ్ లెంగ్త్ బంతులకు వ్యాఖ్యాతలు, విశ్లేషకులే విస్తుపోయారు. పంత్, స్టొయినీస్, హెట్‌మైయిర్ వంటి విధ్వంసకర బ్యాటర్లను క్రీజులోంచి కదలనివ్వలేదు. అత్యంత కచ్చితత్వంతో పాదాల వద్దే బంతిని పిచ్ చేశాడు. ఆఖరి ఓవర్లో బీభత్సం సృష్టించాడు.

మురళీధరన్ అండతో
2016-17 టీఎన్‌పీఎల్ సీజన్లో 7 మ్యాచుల్లో 11 వికెట్లు తీసిన నటరాజన్‌పై తమిళనాడు క్రికెట్ సంఘం దృష్టిపెట్టింది. ఆ తర్వాత ఐపీఎల్ వేలంలో పంజాబ్ జట్టు అతడిని రూ.3 కోట్లకు సొంతం చేసుకుంది. కానీ 6 మ్యాచుల్లో 2 వికెట్లే తీసి 115 పరుగులు ఇవ్వడంతో ఆ తర్వాతి సీజన్‌లో అతడిని వదిలేసింది. టీఎన్‌పీఎల్‌లో అతడి ప్రతిభను గమనించిన మురళీధరన్ 2018 వేలంలో హైదరాబాద్ తరఫున కొనుగోలు చేసేలా కృషిచేశాడు. అయితే ఆడే అవకాశం గత రెండేళ్లలో నట్టూకు రాలేదు. ఇక సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో 11 మ్యాచుల్లో 13 వికెట్లు తీసి అదరగొట్టాడు. తమిళనాడుకు డెత్ బౌలర్‌గా ఆవిర్భవించాడు. దీంతో ఈ సీజన్‌లో హైదరాబాద్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications