
టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీషా ఆడిన తొలి టెస్ట్ మ్యాచ్‌లోనే సెంచరీ చేసి ఒక్కసారిగా స్టార్ అయ్యాడు. అనంతరం గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. కోలుకున్న తర్వాత ప్రస్తుతం ఐపీఎల్‌లో డిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్నాడు. ఆదివారం సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ విజయం సాధించింది. మూడు రోజుల గ్యాప్ అనంతరం ఈ రోజు ఢిల్లీ వేదికగా ముంబైతో తలపడనుంది.
మ్యాచ్‌కు మధ్యన గ్యాప్ దొరకడంతో ఢిల్లీ ఆటగాళ్లు ఒకవైపు ప్రాక్టీస్.. మరోవైపు పార్టీలతో సరదాగా గడుపుతున్నారు. అయితే ఢిల్లీ ఓపెనర్ పృథ్వీషా తన అభిమాన క్రికెటర్ సచిన్‌తో కలిసి బుధవారం ఓ హోటల్‌లో డిన్నర్ చేసాడు. సచిన్.. పృథ్వీకి డిన్నర్ ఇచ్చాడు. సచిన్‌తో డిన్నర్ చేసిన ఫొటోను పృథ్వీ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశాడు. 'ఇంతమంచి డిన్నర్ ఇచ్చినందుకు థాంక్యూ సచిన్ సర్. మిమ్మల్ని కలిసినందుకు ఆనందంగా ఉంది' అని పృథ్వీషా ట్వీటాడు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింలో వైరల్ అయింది.
ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా వేదికగా గురువారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో డిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. ముంబై ఇండియన్స్ జట్టుకు సచిన్ మెంటార్‌గా ఉన్నాడు. ఇరు జట్లు 10 పాయింట్లతో సమానంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెండు జట్లు విజయం కోసం ఎదురుచూస్తున్నాయి. దీంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.