
హైదరాబాద్: ఫిరోజ్ షా కోట్లా వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ముంబై ఓపెనర్లు రోహిత్‌శర్మ(30), క్వింటన్ డికాక్(35) దూకుడుగా ఆడి మంచి శుభారంభాన్ని అందించారు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 57 పరుగులు జోడించిన తర్వాత రోహిత్ శర్మ(30) పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బెన్ కటింగ్(2) తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరగా... మరో ఓపెనర్ డీకాక్(35) రనౌట్ అయ్యాడు. దీంతో ముంబై 74 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది.
ఈ దశలో సూర్యకుమార్ యాదవ్(26) నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డుని నడిపించాడు. జట్టు స్కోరు 104 పరుగుల వద్ద కగిసో రబాడ బౌలింగ్‌లో వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి సూర్యకుమార్ యాదవ్ పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో పాండ్యా సోదరులు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు.
కృనాల్ పాండ్యా 26 బంతుల్లో 37(5 ఫోర్లు), హార్దిక్ పాండ్యా 15 బంతుల్లో 32(2 ఫోర్లు, 3 సిక్సులు)తో మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. చివరి 3 ఓవర్లలో ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మెన్ 50 పరుగులు సాధించడం విశేషం. ఢిల్లీ బౌలర్లలో రబాడ రెండు వికెట్లు సాధించగా, అమిత్ మిశ్రా, అక్షర్ పటేల్‌లు తలో వికెట్ తీశారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచకున్న ముంబై ఇండియన్స్
ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ గత మ్యాచ్‌లోని జట్టునే కొనసాగిస్తుండగా.. ముంబై మాత్రం ఒక మార్పు చేసింది. జయంత్ యాదవ్ స్థానంలో బెన్ కట్టింగ్‌ని జట్టులోకి తీసుకుంది.
ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్‌శర్మ టీ20ల్లో 8 వేల పరుగులు చేసిన మూడో భారత ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 30 పరుగులు నమోదు చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌కు ముందు 8వేల మైలురాయిని చేరడానికి 12 పరుగులు దూరంలో ఉన్నాడు. రోహిత్ కంటే ముందు సురేశ్ రైనా, విరాట్‌కోహ్లీలు ఈ ఘనత సాధించారు. రైనా 295 ఇన్నింగ్స్‌లో 8216 పరుగులు చేయగా.. కోహ్లీ 246 ఇన్నింగ్స్‌లో 8183 పరుగులు చేశాడు.
మరోవైపు రోహిత్ శర్మ 293 ఇన్నింగ్స్‌లో 7998 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌లాడిన ముంబై ఇండియన్స్ ఐదింట విజయం సాధించి పది పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో పది పాయింట్లు ఉన్నప్పటికీ నెట్ రన్ రేట్ విషయంలో మెరుగ్గా ఉండటంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది.
రెండు, మూడు స్థానాల్లో ఉన్న జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండటంతో ఈ మ్యాచ్ ఆసక్తికరంగా సాగనుంది. టాస్ వేయడానికి ముందు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పిచ్‌ను పరిశీలించాడు. ఇందుకు సంబంధించిన వీడియోని ఐపీఎల్ తన అధికారిక ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది. సచిన్ పిచ్‌ను పరిశీలిస్తున్న సమయంలో యువ క్రికెటర్లు పృథ్వీ షా, రిషబ్ పంత్ పక్కనే ఉన్నారు.
జట్ల వివరాలు:
ఢిల్లీ క్యాపిటల్స్
పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), కొలిన్ మున్రో, క్రిస్ మోరిస్, కీమో పాల్, అక్షర పటేల్, అమిత్ మిశ్రా, కగిసో రబాడ, ఇషాంత్ శర్మ
ముంబై ఇండియన్స్
రోహిత్ శర్మ(కెప్టెన్), క్వింటన్ డీకాక్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్, బెన్ కటింగ్, హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, జయంత్ యాదవ్, రాహుల్ చాహర్, లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రా