ఢిల్లీ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ విధ్వంసం సృష్టించాడు. రికార్డులు తిరగరాస్తూ చరిత్ర సృష్టించాడు. ప్రమాదకర బౌలర్ బుమ్రాను కూడా వదిలిపెట్టకుండా సిక్సర్లు, బౌండరీలో హోరెత్తించాడు. 27 బంతుల్లో 84 పరుగులు చేశాడు. 11 ఫోర్లు, ఆరు సిక్సర్లు బాదాడు.
ఈ క్రమంలో 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించిన ఫ్రేజర్ రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ హాఫ్ సెంచరీ బాదిన ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్‌గా జేక్ ఫ్రేజర్ రెండోసారి రికార్డు సాధించాడు. ఐపీఎల్-2024లోనే సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫ్రేజర్ 15 బంతుల్లో అర్ధశతకం సాధించి గతంలోనే చరిత్ర సృష్టించాడు. ఇవాళ ముంబైతో జరిగిన మ్యాచ్‌లో మరోసారి తన రికార్డును తిరగరాశాడు.

జేక్ ఫ్రేజర్ మరో అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్‌లో 15 లేదా అంతకన్న తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన మూడో ఆటగాడిగా ఫ్రేజర్ రికార్డులకెక్కాడు. ఫ్రేజర్ కంటే ముందు ఈ రికార్డును వెస్టిండీస్ విధ్వంసకర ప్లేయర్లు ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్ సాధించారు. ఇక ఐపీఎల్‌లో ఓవరాల్‌గా వేగవంతమైన అర్ధశతకం సాధించిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో ఫ్రేజర్ నిలిచాడు.
తొలి స్థానంలో యశస్వీ జైస్వాల్ (13 బంతుల్లో) ఉన్నాడు. రెండో స్థానంలో కేఎల్ రాహుల్ (14 బంతుల్లో), ప్యాట్ కమిన్స్ (14 బంతుల్లో) ఉన్నారు. మూడో స్థానంలో యూసఫ్ పఠాన్ (15 బంతుల్లో), సునీల్ నరైన్ (15 బంతుల్లో), నికోలస్ పూరన్ (15 బంతుల్లో)తో కలిసి ఫ్రేజర్ సంయుక్తంగా ఉన్నాడు.
ఇక ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్ విషయానికొస్తే..ఫ్రేజర్ ధాటికి ఢిల్లీ క్యాపిటల్స్ పవర్ ప్లేలో 92 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలో పవర్‌ప్లేలో అత్యధిక స్కోరు సాధించిన జట్ల జాబితాలో ఢిల్లీ అయిదో స్థానంలో ఉంది. తొలి స్థానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (125/0) ఉంది.