ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. తమ ఆఖరి లీగ్ స్టేజ్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై 19 పరుగుల తేడాతో నెగ్గింది. ఈ విజయంతో ప్లేఆఫ్స్ రేసులో సాంకేతికంగా నిలిచింది. 14 పాయింట్లు సాధించి తమ అదృష్టంపై ప్లేఆఫ్స్ భారాన్ని వేసింది. 14 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ ఏడు విజయాలతో 14 పాయింట్లు తమ ఖాతాలో వేసుకుంది.
కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ ఇప్పటికే 14 పాయింట్లు అధిగమించాయి. మిగిలిన జట్లు 14 పాయింట్లు లేదా అంతకంటే తక్కువ పాయింట్లు సాధిస్తే ఢిల్లీ ప్లేఆఫ్స్‌కు చేరే అవకాశం ఉంటుంది. కాగా, తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 208 పరుగులు చేసింది. అభిషేక్ పోరెల్ (58; 33 బంతుల్లో, 5x4, 4x6), ట్రిస్టన్ స్టబ్స్ (57*; 25 బంతుల్లో, 3x4, 4x6) మెరుపు అర్ధశతకాలు బాదారు.

అనంతరం ఛేదనలో లక్నో సూపర్ జెయింట్స్ తొమ్దిమి వికెట్లు కోల్పోయి 189 పరుగులే చేసింది. నిలోలస్ పూరన్ (61; 27 బంతుల్లో, 6x4, 4x6), అర్షద్ ఖాన్ (58*; 33 బంతుల్లో, 3x4, 5x6) గొప్పగా పోరాడారు. ఇషాంత్ శర్మ (3/34) మూడు వికెట్లతో సత్తాచాటాడు. అయితే ఛేజింగ్ ఆరంభంలోనే లక్నోకు ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (5; 3 బంతుల్లో, 1x4 )ను ఇషాంత్ శర్మ బోల్తాకొట్టించాడు.
కాసేపటికే డికాక్ (12; 8 బంతుల్లో, 2x4)ను కూడా ఇషాంత్ ఔట్ చేసి లక్నోకు మరో షాక్ ఇచ్చాడు.తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన స్టొయినిస్ (5; 7 బంతుల్లో, 1x4), దీపక్ హుడా (డకౌట్) ఎక్కువసేపు క్రీజులో నిలవకపోవడంతో లక్నో 44/4 తో కష్టాల్లో పడింది. కానీ పూరన్ దూకుడుగా ఆడుతూ స్కోరుబోర్డు పరుగులు పెట్టించాడు. మరో ఎండ్‌లో వికెట్లు పడుతున్నా అదే జోరు కొనసాగించాడు. దీంతో లక్నో పవర్‌ప్లేలో 59/4తో నిలిచింది.

పవర్‌ప్లే అనంతరం కూడా పూరన్ బౌండరీల మోత మోగించాడు. ఈ క్రమంలో 20 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే ప్రమాదకరంగా మారుతున్న పూరన్‌ను ముకేశ్ చౌదరి ఔట్ చేశాడు. ఇక ఢిల్లీ విజయం ఖరారైందని భావించారంతా. కానీ అర్షద్ ఖాన్ అనూహ్యంగా విధ్వంసం సృష్టించాడు. ఫోర్లు, సిక్సర్లుతో మ్యాచ్ స్వరూపాన్ని మార్చాడు. లక్నోను తిరిగి పోటీలోకి తెచ్చాడు. 25 బంతుల్లో మెరుపు అర్ధశతకం సాధించాడు.
లక్ష్యాన్ని క్రమంగా కరిగిస్తూ అర్షిద్ ఖాన్ లక్నోను గెలుపు దిశగా తీసుకెళ్లాడు. కానీ మరో ఎండ్‌లో వికెట్లు పడటంతో లక్నో ఆలౌట్ అవుతుందేమో అనే ఉత్కంఠ పెరిగింది. చివరి ఆరు బంతుల్లో 23 పరుగులు అవసరమవ్వగా రసీక్ అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు పరుగులే ఇచ్చాడు.