యువ ఆటగాళ్లు అభిషేక్ పోరెల్ (58; 33 బంతుల్లో, 5x4, 4x6), ట్రిస్టన్ స్టబ్స్ (57*; 25 బంతుల్లో, 3x4, 4x6) మెరుపు అర్ధశతకాలు బాదడంతో లక్నో సూపర్ జెయింట్స్‌కు ఢిల్లీ 209 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అరుణ్‌జైట్లీ స్టేడియంలో లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. నవీనుల్ రెండు వికెట్లు, అర్షద్ ఖాన్, రవి బిష్ణోయ్ చెరో వికెట్ తీశారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ ప్రారంభమైన రెండో బంతికే జేక్‌ఫ్రేజర్ డకౌటయ్యాడు. అర్షద్‌ఖాన్ బౌలింగ్‌లో నవీనుల్ హక్ చేతికి చిక్కాడు. కానీ మరో ఓపెనర్ అభిషేక్ పోరెల్ విధ్వంసం సృష్టించాడు. బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. అర్షద్ ఖాన్ వేసిన మూడో ఓవర్‌లో అభిషేక్ మూడు ఫోర్లు, ఓ సిక్సర్ బాది 21 పరుగులు పిండుకున్నాడు.

యుద్వీర్ సింగ్ వేసిన ఓవర్‌లో అభిషేక్ రెండు ఫోర్లు, ఓ సిక్సర్, నవీనుల్ హక్ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు, ఓ బౌండరీ బాదాడు. దీంతో ఢిల్లీ పవర్‌ప్లేలో 73 పరుగులు సాధించింది. ఆ తర్వాత ఢిల్లీ స్కోరు వేగం తగ్గింది. అభిషేక్ 21 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన షై హోప్ (38; 27 బంతుల్లో, 3x4, 2x6)ను రవి బిష్ణోయ్ ఔట్ చేశాడు.
కాసేపటికే మరింత ప్రమాదకరంగా మారుతున్న అభిషేక్‌ను నవీనుల్ హక్ పెవిలియన్‌కు చేర్చాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన పంత్ (33; 23 బంతుల్లో, 5x4) బ్యాటు ఝుళిపించినప్పటికీ ఆశించినంత దూకుడుగా ఆడలేకపోయాడు. ఓ దశలో ఢిల్లీ 15 ఓవర్లకు 136/3 స్కోరుతో నిలిచింది. కానీ ఆఖర్లో ట్రిస్టన్ స్టబ్స్ విరుచుకుపడ్డాడు. 22 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. దీంతో ఢిల్లీ 200 మార్క్‌ను తాకింది.