
కోల్‌కతానైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ కొట్టిన ఓ రివర్స్ స్వీప్ షాట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోల్‌కతా బౌలర్ వరుణ్ చక్రవర్తి వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్లో ఓ బంతిని రిషబ్ పంత్ అద్భుతంగా రివర్స్ స్వీప్ షాట్ ఆడాడు. దీంతో ఆ బంతి ఫోర్ కూడా పోయింది. అయితే ఈ క్రమంలో పంత్ చేతిలో నుంచి బ్యాట్ జారిపోయింది. జారీ పోయిన ఆ బ్యాట్ స్టంప్స్‌కు పక్కనే పడింది. కాస్త పక్కకు పడి ఉంటే స్టంప్స్‌కు తగిలేది. దీంతో పంత్ ఔటయ్యేవాడు. బ్యాట్ స్టంప్స్‌కు తగలకపోవడంతో పంత్ ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు.
సోషల్ మీడియాలో ఈ వీడియోను పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. బ్యాట్ వికెట్లకు తాకి ఉంటే ఎంత పని అయ్యేది పంత్ అని నెటిజన్లు రాసుకొస్తున్నారు. ఈ సారైనా బ్యాట్‌ను గట్టిగా పట్టుకోమని సూచిస్తున్నారు. కాగా పంత్ ఇలా బ్యాట్‌ను వదిలేయడం ఇది మొదటి సారి ఏం కాదు. గతంలోనూ పలుమార్లు ఇలాగే షాట్ ఆడే క్రమంలో బ్యాట్‌ను వదిలేశాడు. ఇక ఈ మ్యాచ్‌ల్లో 14 బంతులు ఎదుర్కొన్న రిషబ్ పంత్ 2 ఫోర్లు, 2 సిక్సులు 27 పరుగులు చేశాడు.
ఇక ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు చెలరేగారు. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, పృథ్వీ షా హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. రిషబ్ పంత్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్ కూడా మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడడంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోర్ సాధించింది. దీంతో కోల్‌కతానైట్ రైడర్స్ ముందు 216 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఉంచింది. ఢిల్లీ బ్యాటర్లలో వార్నర్ 61, పృథ్వీ షా 51, శార్దూల్ 29*, రిషబ్ పంత్ 27, అక్షర్ పటేల్ 22, పావెల్ 8, లలిత్ యాదవ్ ఒక పరుగు చేశారు. కోల్‌కతా బౌలర్లలో సునీల్ నరైన్ 2, వరుణ్ చక్రవర్తి, రసూల్, ఉమేష్ యాదవ్ తలో వికెట్ తీశారు.