DC VS KKR: ఐపీఎల్ 2025లో భాగంగా తాజాగా జరిగిన మ్యాచులో కోల్‌కతా నైట్‌రైడర్స్ మంచి విజయాన్ని అందుకుంది. సునీల్ నరైన్ (27, 3/29) ఆల్‌రౌండ్ ప్రదర్శన చేయడంతో 14 పరుగుల తేడాతో దిల్లీ క్యాపిటల్స్‌పై గెలుపొందింది. ఛేదనలో ఓ దశలో దిల్లీ లక్ష్యం దిశగా సాగినప్పటికీ.. కీలక సమయంలో నరైన్ తన మాయాజాలంతో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.
ఇద్దరికీ నాలుగోది...
ఈ మ్యాచులో మొదట కోల్‌కతా జట్టు 9 వికెట్లకు 204 పరుగులు చేసింది. రఘువంశీ (44; 32 బంతుల్లో 3×4, 2×6), రింకు సింగ్ (36; 25 బంతుల్లో 3×4, 1×6) బ్యాటుతో రాణించారు. నరైన్ 27 పరుగులు చేశాడు. ఛేదనలో డుప్లెసిస్ (62; 45 బంతుల్లో 7×4, 2×6), అక్షర్ పటేల్ (43; 23 బంతుల్లో 4×4, 3×6) రాణించినప్పటికీ.. దిల్లీ 9 వికెట్లకు 190 పరుగులే చేసింది. నరైన్‌తో పాటు వరుణ్ (2/39), అనుకుల్ రాయ్ (1/27) కూడా బంతితో మెరిశారు. కాగా, గత నాలుగు మ్యాచ్‌ల్లో దిల్లీకి ఇది మూడో పరాజయం. మొత్తంగా కోల్‌కతాకు పది మ్యాచ్‌ల్లో ఇది నాలుగో విజయం అవ్వగా.. దిల్లీ నాలుగో ఓటమిని అందుకుంది.

ప్రత్యేకం ఏమీ కాదూ..
మ్యాచ్ అనంతరం సునీల్ నరైన్ మాట్లాడుతూ.. "ఇది పూర్తిగా జట్టు విజయం. మిడిల్ ఓవర్లలో మంచిగా ఆడాం. రఘువంశీ, రింకు సింగ్ బ్యాటుతో బాగా రాణించారు. జట్టుకు అవసరమైనప్పుడు తిరిగి పంజుకోగలనని నాకు నాపై నమ్మకం ఉంది. ఈ ఆట ఎలాంటిదంటే.. కొన్ని సందర్భాల్లో బాగా మొదలుపెట్టి.. ఆ తర్వాత ఇబ్బందిపడొచ్చు, లేదంటే ముందు తడబడి ఆ తర్వాత మంచి ముగింపు ఇవ్వగలరు. ప్రతి వికెట్‌ను నేను ముఖ్యంగానే భావిస్తాను. నాకు ప్రత్యేకంగా నచ్చిన వికెట్ అంటూ ఏమీ లేదు. ఆటను ఆస్వాదిస్తాను. నేను గొప్ప ఫీల్డర్ కాదు, కానీ కుదిరినప్పుడు ఒక మంచి రనౌట్ చేయడం చాలా సంతృప్తికరంగా ఉంటుంది. బంతిని బలంగా విసిరాను (కేఎల్ రాహుల్ రనౌట్ గురించి), అంతకుమించే ఏం చేయలేదు. గర్వంగా ఉంది. ఒత్తిడి పరిస్థితిలో కెప్టెన్ నన్ను నమ్మదగిన ఆటగాడిగా భావించాలి." అని చెప్పుకొచ్చాడు.