DC vs GT: ఐపీఎల్ 2026లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న ఆసక్తికర పోరులో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. గత రెండు మ్యాచ్‌ల్లో లక్ష్య ఛేదనలో అద్భుతంగా రాణించామని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్షర్ తెలిపాడు. వర్షం కారణంగా పిచ్‌పై కొంత తేమ ఉండే అవకాశం ఉందని.. దీనిని సద్వినియోగం చేసుకుని గుజరాత్‌ను తక్కువ పరుగులకే కట్టడి చేస్తామని ధీమా వ్యక్తం చేశాడు. ఢిల్లీ జట్టు ఎటువంటి మార్పులు లేకుండా అదే తుది జట్టుతో బరిలోకి దిగుతోంది.
మరోవైపు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. తన మెడ నొప్పి సమస్య ఇప్పుడు మెరుగుపడిందని వెల్లడించాడు. టాస్ గెలిచినా తాము ముందుగా బ్యాటింగ్ చేయడానికే మొగ్గు చూపేవాళ్లమని.. వాతావరణం ఇలాగే ఉంటే రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం ఉండదని అభిప్రాయపడ్డాడు. సాయి సుదర్శన్‌తో కలిసి మంచి ఓపెనింగ్ భాగస్వామ్యాలు నెలకొల్పుతున్నామని, ఈ మ్యాచ్‌లో భారీ స్కోరు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు. గుజరాత్ జట్టులో ఒక మార్పు జరిగింది. కుమార్ కుశాగ్ర స్థానంలో శుభ్‌మన్ గిల్ జట్టులోకి వచ్చాడు.

తుది జట్లు:
గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (కీపర్), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కాగిసో రబడ, మహమ్మద్ సిరాజ్, అశోక్ శర్మ.
ఢిల్లీ క్యాపిటల్స్: కేఎల్ రాహుల్ (కీపర్), పాతుమ్ నిస్సంక, నితీష్ రాణా, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్ (కెప్టెన్), విప్రాజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్, లుంగీ ఎన్గిడి, నటరాజన్, ముఖేష్ కుమార్.