DC vs CSK: ఆదుకున్న ధావన్, హెట్‌మైర్.. ఉత్కంఠ పోరులో చెన్నైపై విజయం! టాప్‌లోకి దూసుకెళ్లిన ఢిల్లీ!!

దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో భాగంగా దుబయ్ అంతర్జాతీయ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)తో జరిగిన మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) త్రిల్లింగ్ విక్టరీ సాధించింది. చివరి ఓవర్ వరకు నువ్వానేనా అన్నట్టు సాగిన మ్యాచులో విజయం ఢిల్లీనే వరించింది. చెన్నై నిర్ధేశించిన 137 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ మరో రెండు బంతులు ఉండగా 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. శిఖర్ ధావన్ (39), షిమ్రోన్ హెట్‌మైర్ (28) ఢిల్లీ విజయంలో కీలకపాత్ర పోషించారు. చెన్నై బౌలర్లలో శార్దుల్ ఠాకూర్, రవీంద్ర జడేజా తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో టాప్‌లోకి దూసుకెళ్లింది. ఐపీఎల్ 2021లో చెన్నైపై ఆడిన రెండు మ్యాచులో ఢిల్లీనే గెలుపొందింది.

ఉత్కంఠ నెలకొన్నా:
స్వల్ప లక్ష్య ఛేదనలో ఢిల్లీ ఓపెనర్ పృథ్వీ షా (18) ధాటిగా ఆడాడు. మూడు ఫోర్లు బాది మంచి ఊపులో కనిపించాడు. అయితే భారీ షాట్ ఆడే ప్రయత్నంలో మూడో ఓవర్లో ఔట్ అయ్యాడు. ఆపై శ్రేయస్ అయ్యర్ (2) విఫలమయ్యాడు. ఈ సాయంలో శిఖర్ ధావన్ ఆచితూచి ఆడాడు. రిషభ్ పంత్ (15), రిపాల్ పటేల్ (18)లతో కలిసి మంచి భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఒక పరుగు వ్యవధిలో ధావన్, అశ్విన్ అవుట్ అవ్వడంతో ఉత్కంఠ నెలకొంది. అయితే షిమ్రోన్ హెట్‌మైర్ జట్టును ఆదుకున్నాడు. అక్షర్ పటేల్ సాయంతో ఢిల్లీని విజయం ముంగిట నిలిపాడు. ఇక 12 బంతుల్లో 16 పరుగులు అవసరం కాగా.. ఓ సిక్స్ బాది 10 పరుగులు రాబట్టాడు. చివరిలో ఓవర్లో 4 పరుగులుకావాల్సి ఉండగా.. ఉత్కంఠ నెలకొన్నా రబడా ఫోర్ బాది ఢిల్లీకి విజయాన్ని అందించాడు.

ఆదిలోనే షాక్:
అంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకి ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ ఫాఫ్ డుప్లెసిస్ (10) త్వరగానే ఔట్ అయ్యాడు. అక్షర్ పటేల్ వేసిన మూడో ఓవర్ నాలుగో బంతికి పెవిలియన్ చేరాడు. ఆ తరువాత కాసేపటికే మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (13) ఔట్ అయ్యాడు. దీంతో స్కోర్ వేగం పూర్తిగా తగ్గిపోయింది. మోయిన్ అలీ (5) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. రాబిన్ ఉతప్ప 19 బంతుల్లో 19 పరుగులు చేసి.. ఔట్ అయ్యాడు. దాంతో చెన్నై 62 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఆదుకున్న రాయుడు:
ఈ సమయంలో అంబటి రాయుడు (55) జట్టును ఆదుకున్నాడు. ఢిల్లీ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొని పరుగులు చేశాడు. చెత్త బంతులను మాత్రమే బౌండరీలకు పంపిస్తూ చెన్నై స్కోరును ముందుకు నడిపాడు. ఈ క్రమంలోనే రాయుడు హాఫ్ సెంచరీ చేశాడు. మరోవైపు కెప్టెన్ ఎంఎస్ ధోనీ మరి నెమ్మదిగా ఆడాడు. ఇన్నింగ్స్ చివరలో కూడా ధాటిగా ఆడలేకపోయాడు. 18 పరుగులు చేసినా.. అందుకు 27 బంతులు ఆడాడు. దాంతో చెన్నై స్కోరుకు బ్రేకులు పడ్డాయి. రవీంద్ర జడేజా 2 బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు. దాంతో చెన్నై స్వల్ప స్కోరుకే పరిమితమైంది. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ రెండు.. రవిచంద్రన్ అశ్విన్, అన్రిచ్ నోర్జ్, అవేశ్ ఖాన్ తలో వికెట్ తీశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications