
దుబాయ్: చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)తో దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2021 క్వాలిఫయర్ 1 మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 రన్స్ చేసి.. చెన్నై ముందు 173 పరుగులు లక్ష్యాన్ని ఉంచింది. ఢిల్లీ ఓపెనర్ పృథ్వీ షా (60; 34 బంతుల్లో 7x4, 3x6) హాఫ్ సెంచరీ బాదగా.. శిమ్రాన్ హెట్‌మెయిర్ (37; 24 బంతుల్లో 3x4, 1x6) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక కెప్టెన్ రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ చేసినా (51; 35 బంతుల్లో 3x4, 2x6) ఇన్నింగ్స్ చివరలో ధాటిగా ఆడలేకపోయాడు. స్టార్ ప్లేయర్స్ శిఖర్ ధావన్ (7), శ్రేయాస్ అయ్యర్ (1) విఫలమయ్యారు. చెన్నై బౌలర్లలో జోష్ హజిల్‌వుడ్ రెండు వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, మొయిన్ అలీ తలో వికెట్ తీశారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి మంచి ఆరంభం లభించింది. సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ నెమ్మదిగా ఆడినా.. యువ ఓపెనర్ పృథ్వీ షా బౌండరీలతో విరుచుకుపడ్డాడు. జోష్ హేజిల్‌వుడ్ వేసిన రెండో ఓవర్‌లో సిక్స్, ఫోర్ బాదిన పృథ్వీ.. దీపక్ చహర్ వేసిన తర్వాతి ఓవర్‌లో ఏకంగా నాలుగు ఫోర్లు కొట్టాడు. అయితే హేజిల్‌వుడ్ వేసిన నాలుగో ఓవర్లో ధావన్ కీపర్ ఎంఎస్ ధోనీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. వికెట్ పడినా కూడా షా జోరు కొనసాగింది. శార్దూల్ ఠాకూర్ వేసిన ఐదో ఓవర్లో పృథ్వీ రెండు సిక్స్‌లు బాదాడు. దాంతో ఢిల్లీ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. అదే ఓవర్లో శ్రేయాస్ అయ్యర్ (1) అవుట్ అయ్యాడు. ఆపై అక్షర్ పటేల్ (10) షాకు కాసేపు అండగా నిలిచాడు. షా ధాటిగా ఆడడంతో ఢిల్లీ స్కోర్ వేగం పెరుగుతూ వచ్చింది.
ధాటిగా ఆడిన పృథ్వీ షా హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. అయితే 10వ ఓవర్లో అక్షర్ పటేల్‌ను మొయిన్ అలీ ఔట్ చేశాడు. ఇక 11 ఓవర్‌లో షాను రవీంద్ర జడేజా పెలివియన్‌కి పంపించాడు. దాంతో ఢిల్లీ స్కోర్ వేగం తగ్గింది. ఈ సమయంలో రిషబ్ పంత్, శిమ్రాన్ హెట్‌మయర్ ఢిల్లీని ఆదుకున్నారు. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ ఇన్నింగ్స్‌ని ముందుకు నడిపించారు. క్రీజులో ఇద్దరు హార్డ్ హిట్టర్లు ఉన్న నేపథ్యంలో ఢిల్లీ భారీ స్కోర్ చేస్తుందని అందరూ ఊహించారు. డ్వేన్ బ్రావో వేసిన 19 ఓవర్లో హెట్‌మయర్ ఔట్ అయ్యాడు. ఇక చివరి ఓవర్లో పంత్ ధాటిగా ఆడుతాడనుకున్నా.. వరుసగా మూడు బంతులకు ఒక్క పరుగులు కూడా చేయలేదు. చివరి బంతికి రెండు పరుగులు చేసిన పంత్ హాఫ్ సెంచరీ చేశాడు. చెన్నై బౌలర్లలో హేజిల్‌వుడ్ రెండు.. జడేజా, అలీ, బ్రావో తలో వికెట్ తీశారు.
ఈ మ్యాచులో విజయం సాధించడం ఇరు జట్లకు చాలా కీలకం. మొదటి క్వాలిఫయర్‌లో ఏ జట్టు గెలిచినా.. నేరుగా ఫైనల్‌కు వెళ్తుంది. ఓడిపోయిన జట్టు ఫైనల్ బెర్త్ కోసం బుధవారం జరిగే క్వాలిఫయర్-2లో గెలిచిన జట్టుతో మరో మ్యాచ్ ఆడనుంది. లీగ్ రౌండ్‌లో 14 మ్యాచ్‌ల్లో 10 విజయాలతో ఢిల్లీ కాపిటల్స్ 20 పాయింట్లు సాధించి పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ 14 మ్యాచ్‌లలో తొమ్మిది విజయాలతో రెండవ స్థానంలో ఉంది.