
దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో భాగంగా మరికొద్దిసేపట్లో పాయింట్ల పట్టికలోని తొలి రెండు జట్ల మధ్య పోరు ఆరంభం కానుంది. దుబయ్ అంతర్జాతీయ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ), చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) తలపడనున్నాయి. ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ ఢిల్లీ ఒక మార్పు చేసింది. స్టీవ్ స్మిత్ బదులుగా రిపాల్ పటేల్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు చెన్నై సారథి ఎంఎస్ ధోనీ తుది జట్టులో మూడు మార్పులు చేశాడు. డ్వేన్ బ్రావో, రాబిన్ ఉతప్ప, దీపక్ చహర్ జట్టులోకి వచ్చారు. సామ్ కరన్, సురేష్ రైనాలకు రెస్ట్ ఇచ్చాం అని మహీ తెలిపాడు.
ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు ప్రస్తుతం 18 పాయింట్లు ఉన్నా.. మెరుగైన రన్ రేట్ కారణంగా పాయింట్ల పట్టికలో చెన్నై అగ్రస్థానంలో ఉంది. దాంతో ఈ రోజు గెలిచిన జట్టు లీగ్ దశ ముగిసేసరికి టాప్-2లో నిలవనుంది. టాప్-2లో ఉన్న జట్టుకు నేరుగా ఫైనల్ వెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఓడినా కూడా మరో అవకాశం ఉండనుంది. అందుకే ఇరు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాయి. ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు మొదలు కానుంనుంది. ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఇక ఓటీటీలో కూడా ఈ మ్యాచ్‌ను చూడాలనుకునే ఫాన్స్ హాట్‌స్టార్‌లో వీక్షించవచ్చు. ప్రస్తుతం ఇరు జట్లలో స్టార్ ఆటగాళ్లు ఉన్న నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది. మ్యాచుకు ఎలాంటి వర్షపు ముప్పులేదు. దుబాయ్ మైదానం పెద్దది కాబట్టి బౌండరీలు రావడం కాస్త కష్టమే.
ఐపీఎల్ 2021లో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడడం ఇది రెండోసారి. అంతకుముందు జరిగిన పోరులో ఢిల్లీ విజయం సాధించింది. ఇక దుబయ్ పిచ్‌లో ఈ రెండు జట్లు తలపడటం ఇది రెండోసారి. మొదటి మ్యాచులో ఢిల్లీ విజయం సాధించింది. రెండోసారి చెన్నై గెలిచింది. గత 5 మ్యాచ్‌లలో రిషబ్ పంత్ సేన 3-2 తేడాతో విజయం సాధించింది. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఈ రెండు జట్ల మధ్య మొత్తం 24 మ్యాచులు జరిగాయి. ఇందులో చెన్నై 15 సార్లు గెలిచింది. మరోవైపు ఢిల్లీ కేవలం 9 సార్లు మాత్రమే విజయం సాధించింది.
ఢిల్లీ, చెన్నై జట్ల బలాబాలాను పరిశీలిస్తే.. కాగితంపై కనిపించినట్లే మైదానంలోనూ ఆడుతున్నాయి. రెండు జట్లు ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్‌లోనూ సత్తాచాటుతూ టోర్నమెంట్‌లో దూసుకోతున్నాయి. దాంతో ఈరోజు జరిగే పోటీ చాలా హోరాహోరీగా ఉండబోతుంది. ఐపీఎల్ 2021లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జట్టుగా చెన్నై ఉంది. ఇప్పటివరకు మొత్తం 96 సిక్సర్లు చెన్నై బ్యాటర్లు బాదారు. ఇందులో రుతురాజ్ గైక్వాడ్ ఒక్కడే 20 సిక్సర్లు కొట్టాడు. అంతేకాదు గైక్వాడ్ ఐపీఎల్ 2021లో ఫోర్లు కొట్టడంలో కూడా ముందున్నాడు. ఇప్పటివరకు అతడు 43 ఫోర్లు బాదేశాడు.
తుది జట్లు:
పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), రిపాల్ పటేల్, షిమ్రోన్ హెట్‌మైర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబాడ, అన్రిచ్ నోర్జే, అవేశ్ ఖాన్.
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డుప్లెసిస్, రాబిన్ ఉతప్ప, మోయిన్ అలీ, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ (కెప్టెన్, కీపర్), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శార్దూల్ ఠాకూర్, జోష్ హాజెల్‌వుడ్, దీపక్ చహర్.