
హెడ్ టు హెడ్ రికార్డ్స్
ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరగనున్న మొదటి క్వాలిఫయర్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు జరుగుతుంది. రాత్రి 7 గంటలకు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో టాస్ వేయనున్నారు. ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. అలాగే డిస్నీ+హాట్‌స్టార్ యాప్‌లోనూ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఐపీఎల్ టోర్నీలో భాగంగా ఢిల్లీ, చెన్నై జట్లు 25 సార్లు తలపడ్డాయి. ఇందులో చెన్నై 15 సార్లు గెలుపొందగా.. ఢిల్లీ 10 విజయాలు అందుకుంది. ఐపీఎల్ 2021లో ఢిల్లీ, చెన్నై తలపడిన రెండు మ్యాచులో పంత్ సేన విజయం సాదించింది. ఇరు జట్ల మధ్య చివరి ఐదు మ్యాచుల్లో ఒకటి చెన్నై, నాలుగు ఢిల్లీ గెలిచింది. ఇప్పుడు ఈ సీజన్‌లో మూడోసారి ఇరు జట్లు తలపడబోతున్నాయి.

పిచ్ రిపోర్ట్
దుబాయ్ పిచ్ బ్యాటింగ్‌కు కాస్త కష్టంగానే ఉంటుంది. ఈ మైదానంలో జరిగిన గత ఏడు మ్యాచ్‌ల్లో ఒక్క ఇన్నింగ్స్‌లోనూ స్కోరు 170 దాటలేదు. బౌలర్లకు ఎక్కువగా సహకరించే ఆస్కారముంది. మొదటలో పేసర్లకు, ఆపై స్పిన్నర్లకు అనుకూలంగా ఉండనుంది. ఇక టాస్ గెలిచిన జట్టు ఛేదనకే మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఈ సీజన్‌లో ఇక్కడ జరిగిన 11 మ్యాచ్‌ల్లో ఎనిమిది సార్లు రెండో సారి బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం ఉండడమే అందుకు కారణం. ఇరు జట్లలోని ప్లేయర్స్ అందరూ బాగానే ఉన్నారు. కీలక మ్యాచుకు అందరూ అందుబాటులో ఉన్నారు. అయితే చెన్నై ఆల్‌రౌండర్ సామ్ కరన్ ఇప్పటికే గాయం కారణంగా లీగ్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.

పటిష్ఠంగా ఢిల్లీ
తొలి ఐపీఎల్ టైటిల్ వేటలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్.. వరుసగా మూడో సీజన్‌లోనూ ప్లే ఆఫ్స్‌కు చేరింది. 2019లో రెండో క్వాలిఫయర్‌లో ఓడిన ఢిల్లీ.. గతేడాది ఫైనల్లో పరాజయం పాలైంది. గత రెండు సార్లు టైటిల్‌కు చేరువై దూరమైన ఢిల్లీ.. ఈ సారి మాత్రం ట్రోఫీ సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ అన్ని విభాగాల్లోనూ పటిష్ఠంగా ఉంది.
బ్యాటింగ్‌లో ఓపెనర్లు శిఖర్ ధావన్, పృథ్వీ షా జట్టుకు ఆరంభాలనిస్తున్నారు. ధావన్ (544) అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. షా కూడా నిలకడగా రాణిస్తున్నాడు. వీళ్లిద్దరూ మరోసారి జట్టుకు శుభారంభాన్ని అందిస్తే.. చెన్నైకి చిక్కులు తప్పవు. రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, శిమ్రాన్ హెట్‌మయర్, మార్కస్ స్టాయినిస్, అక్షర్ పటేల్‌లతో బ్యాటింగ్ పటిష్ఠంగా కనిపిస్తోంది.
అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో రెండో స్థానంలో ఉన్న అవేశ్ ఖాన్ (22)తో పాటు సఫారీ పేస్ ద్వయం కాగిసో రబాడ, అన్రిచ్ నోర్జ్‌తో కూడిన పేస్ దళం కూడా బాగుంది. అవేశ్ వికెట్ల వేటలో దూసుకెళ్తున్నాడు. అక్షర్ తన స్పిన్‌తో ఆకట్టుకుంటున్నాడు. సీనియర్ స్పిన్నర్ ఆర్ అశ్విన్ ఉండనే ఉన్నాడు. దుబాయ్ స్టేడియంలో ఢిల్లీకి మంచి రికార్డు ఉండడం కూడా ఆ జట్టుకు కలిసొచ్చే అంశం.

ఫాఫ్, రుతురాజ్‌పైనే భారం
ఇప్ప్పటివరకు అన్ని సీజన్లలోనూ ప్లే ఆఫ్స్ చేరిన చెన్నై.. గతేడాది మాత్రం పేలవ ప్రదర్శనతో నిరాశపరిచింది. దీంతో చెన్నైపై ఎన్నో అనుమానాలు రేకెత్తాయి. కానీ ఈ సీజన్‌లో పాత జట్టును తలపించింది. ఈ క్రమంలోనే నాలుగో టైటిల్‌ను పట్టేయాలని చూస్తోంది. చెన్నై బ్యాటింగ్ భారం ఓపెనర్లు ఫాఫ్ డుప్లెసిస్ (546), రుతురాజ్ గైక్వాడ్ (533)లపైనే ఉంది. కీలక మ్యాచ్‌లోనూ వీరిద్దరూ చెలరేగడం కీలకంగా మారింది.
అయితే షార్ట్ పిచ్ బంతులు ఎదుర్కోవడంలో బలహీనత ప్రదర్శిస్తున్న రుతురాజ్.. నోర్జ్, రబాడ్ బంతులను ఎలా ఆడతాడో చూడాలి. మిడిలార్డర్‌లో మొయిన్ అలీ, అంబటి రాయుడు జట్టును ఆదుకుంటున్నారు. రవీంద్ర జడేజా మెరుపు ముగింపులు ఇవ్వడం కలిసొచ్చే అంశం. ఇక కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఫామ్ జట్టును కలవరపరిచే అంశం.
సారథిగా తిరుగులేని వ్యూహాలతో జట్టును నడిపించే మహీ.. బ్యాట్‌తోనూ చెలరేగితే తిరుగుండదు ఈ మ్యాచ్‌లో సురేష్ రైనా, రాబిన్ ఉతప్పలో ఎవరిని ఆడిస్తారో చూడాలి. డ్వేన్ బ్రావో ఆల్‌రౌండ్ షో చెన్నైకి ఎప్పుడూ కీలకమే. శార్దూల్ ఠాకూర, దీపక్ చహర్, జోష్ హేజిల్‌వుడ్ పేస్ త్రయం ఢిల్లీ బ్యాటర్లకు సవాలు విసరనుంది.

తుది జట్లు (అంచనా)
ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (కెప్టెన్), శిమ్రాన్ హెట్‌మైర్, మార్కస్ స్టొయినిస్/రిపాల్ సింగ్, అక్షర్ పటేల్, ఆర్ అశ్విన్, కాగిసో రబడ, అన్రిచ్ నోర్జ్, అవేశ్ ఖాన్.
చెన్నై: రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డుప్లెసిస్, మొయిన్ అలీ, అంబటి రాయుడు, రాబిన్ ఉతప్ప/సురేష్ రైనా, ఎంఎస్ ధోనీ (కెప్టెన్), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శార్దూల్ ఠాకూర్, దీపక్ చహర్, జోష్ హజిల్‌వుడ్.

డ్రీమ్ 11 టీమ్:
రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), శిఖర్ ధావన్ (వైస్ కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (కీపర్), మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, మార్కస్ స్టొయినిస్,శార్దూల్ ఠాకూర్, దీపక్ చహర్, అన్రిచ్ నోర్జ్.


Click it and Unblock the Notifications












