
దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 తొలి క్వాలిఫయర్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపాలవ్వడం తమను తీవ్ర నిరాశకు గురిచేసిందని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ అన్నాడు. ఇప్పుడు తమ పరిస్థితి వివరించడానికి మాటలు రావడం లేదన్నాడు. తప్పులను సరిచేసుకొని తర్వాతి మ్యాచ్‌కు సిద్ధమవ్వడమే తమ ముందున్న ఏకైక మార్గం అని పంత్ తెలిపాడు. దుబాయ్ మైదానంలో ఆదివారం రాత్రి జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో రెండు బంతులు మిగిలుండగానే చెన్నై విజయం సాధించింది. చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ (18; 6 బంతుల్లో 3x4, 1x6) చివరి ఓవర్‌లో మూడు ఫోర్లు బాది తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో ధోనీసేన ఐపీఎల్‌లో తొమ్మిదోసారి ఫైనల్ చేరింది. \
క్వాలిఫయర్-1లో గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ శుక్రవారం జరిగే ఐపీఎల్ 2021 ఫైనల్స్‌లో ఆడనున్నది. క్వాలిఫయర్-1లో ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్స్‌కు చేరుకునేందుకు మరో అవకాశం ఉంది. సోమవారం జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలుపొందే జట్టుతో ఢిల్లీ రెండో క్వాలిఫయర్ మ్యాచ్ బుధవారం ఆడనుంది. ఆ మ్యాచులో ఢిల్లీ గెలిస్తే.. ఫైనల్ చేరుకుంటుంది. ఒకవేళ ఓడితే మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది. గతేడాది ఢిల్లీ ఫైనల్ చేరినా.. ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే.
మ్యాచ్ అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ మాట్లాడుతూ... 'ఈ ఓటమి తీవ్ర నిరాశ కలిగించింది. ఇప్పుడు మా పరిస్థితి వివరించడానికి కూడా మాటలు రావడం లేదు. మా తప్పులను సరిచేసుకొని తర్వాతి మ్యాచ్‌కు సిద్ధమవ్వడమే మా ముందున్న ఏకైక మార్గం. మ్యాచ్‌లో టామ్ కరన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కానీ దురదృష్టంకొద్దీ చివరి ఓవర్‌లోనే పరుగులు సమర్పించుకున్నాడు. మ్యాచ్ మొత్తంలో ఎవరు బాగా బౌలింగ్ చేశారో.. అతడితోనే చివరి ఓవర్ వేయిస్తే బాగుంటుందని అనుకున్నా. అందుకే చివరి ఓవర్ అతడికి ఇచ్చాను. మేం చేసిన 172 పరుగుల స్కోర్ విజయం సాదించాడనికి సరిపోతుందని భావించా. కానీ చెన్నై ప్లేయర్స్ పవర్‌ప్లేలో బాగా ఆడారు. తర్వాత మేం ఆశించినన్ని వికెట్లు తీయలేకపోయం. అదే మా ఓటమికి కారణం అయి ఉంటుంది. ఇక మా తప్పుల నుంచి నేర్చుకొని తర్వాతి మ్యాచ్‌లో విజయం సాధించి ఫైనల్ చేరతామనే ఆశిస్తున్నా' అని చెప్పాడు.
ఇక మ్యాచ్ అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మాట్లాడుతూ... 'ఇది కీలకమైన ఇన్నింగ్స్. ఢిల్లీ బౌలర్లు పెద్ద బౌండరీని బాగా ఉపయోగించుకున్నారు. ఈ మ్యాచ్‌లో నేను ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. బంతిని చూసి షాట్లు ఆడానంతే. ఐపీఎల్ 2021లో నేను పెద్దగా రాణించలేదు. అందుకే ఆ పరిస్థితుల నుంచి బయటపడాలనుకున్నా. బంతి ఎక్కడ పడుతుంది, బౌలర్ ఎలాంటి వేరియేషన్లతో వస్తున్నాడు అనేవి ఆలోచించి ఆడాను. అలా కాకుండా ఇతర విషయాలు గురించి ఆలోచిస్తే బ్యాటింగ్‌పై దృష్టిపెట్టలేను. జట్టు ప్రదర్శన బాగుంది. అందరూ తమతమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించారు. ఫైనల్ చేరడం చాలా సంతోషంగా ఉంది. ఫైనల్లో కూడా బాగా ఆడుతామనే నమ్మకం ఉంది' అని అన్నాడు.