
హైదరాబాద్: టెస్టు క్రికెట్‌కు ఆదరణ పెరగాలంటే డే-నైట్ టెస్టులు నిర్వహించాలని భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. ఇటీవల శ్రీలంకతో కోల్‌కతా వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌కి ప్రేక్షకులు అనుకున్న స్థాయిలో హాజరు కాకపోవడంపై గంగూలీ స్పందించాడు.
టెస్టు మ్యాచ్‌లు చూసేందుకు ప్రేక్షకులను స్టేడియాలకు రప్పించాలంటే డే-నైట్ టెస్టులు అయితే బాగుంటుందని గంగూలీ పేర్కొన్నాడు. 'డే/నైట్ టెస్టులు అనివార్యం. ఏదో ఒకరోజు అదే జరుగుతుంది. ఇది చాలా సింపుల్ విషయం. ఎరుపు బంతి బదులు గులాబీ బంతి వాడతారు. జనాలు సాయంత్రం వచ్చి మ్యాచ్ చూస్తారు. అంతే' అని గంగూలీ అన్నాడు.
ఇక, మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో డబుల్ సెంచరీ సాధించిన రోహిత్ శర్మపై గంగూలీ ప్రశంసల వర్షం కురిపించాడు. 'లంక బౌలర్లను చూసి దేవుడా అనుకున్నా. వారి బంతుల్ని అలవోకగా స్టాండ్స్‌లోకి పంపించాడు రోహిత్. వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు చేయడం అద్భుతం' అని గంగూలీ అన్నాడు.
'రోహిత్ ఇన్నింగ్స్ అద్భుతం. 36 బంతుల్లోనే సెంచరీని డబుల్ సెంచరీగా మలిచాడు. శ్రీలంక బౌలర్లను నేను చూశాను. వారి బంతుల్ని అలవోకగా ఫోర్లు, సిక్సులుగా మలిచాడు రోహిత్. టీ20 ఫార్మెట్‌తో టైమ్‌లో మార్పు వచ్చింది. రోహిత్ సీరియస్ ప్లేయర్. విరాట్ కోహ్లీ, డేవిడ్ వార్నర్‌లతో పోలిస్తే రోహిత్ శర్మ వన్డే రికార్డు ఈ ఏడాది అద్భుతంగా ఉంది' అని గంగూలీ తెలిపాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.