
లండన్: అన్ని జట్లలలో కెల్ల టీ20ల్లో ఇంగ్లండ్ ఎప్పుడూ ముందుంటని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫార్మాట్, ఫార్మాట్‌కు ప్రత్యేక బ్యాట్స్‌మెన్ ఉండడంతో.. ఆ జట్టు టీ20ల్లో అధిక విజయాలను అందుకుంటోంది. ఇక ఇంగ్లీష్ సంచలనం డేవిడ్ మలన్ నిలకడగా రాణిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. కేవలం 16 ఇన్నింగ్స్‌ల్లో 7 అర్ధ సెంచరీలు, ఓ సెంచరీ నమోదు చేశాడు. దీంతో అతడిని ప్రపంచంలోనే మేటి బ్యాట్స్‌మెన్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పోలుస్తున్నారు.
విరాట్ కోహ్లీతో పోల్చడాన్ని డేవిడ్ మలన్ వద్ద ప్రస్తావించగా.. తాను టీమిండియా సారథి దరిదాపుల్లో కూడా లేనని పేర్కొన్నాడు. 'నేను కనీసం విరాట్ కోహ్లీ దరిదాపుల్లో కూడా లేను. కేవలం 16 ఇన్నింగ్స్‌లు మాత్రమే ఆడాను. కనీసం 50 మ్యాచ్‌లు ఆడి, వాటిల్లో రాణిస్తే అప్పుడు కోహ్లీతో పోల్చినా ఓ అర్థం ఉంటుంది' అని క్రిక్‌ఇన్ఫో నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ప్రస్తుతం జట్టులో తన స్థానమేంటో తెలుసునని, అవకాశం ఇచ్చినప్పుడు నిరూపించుకునేందుకు శ్రమిస్తానన్నాడు.
76 టీ20ల్లో 50.8 సగటుతో 2794 పరుగులు చేసి అగ్ర స్థానంలో ఉన్న విరాట్ కోహ్లీతో తనను పోల్చడాన్ని డేవిడ్ మలన్ ఖండించాడు. ఇంగ్లండ్ జట్టుకు జాసన్ రాయ్, బెన్ స్టోక్స్ అందుబాటులో లేనప్పుడు డేవిడ్ మలన్‌కు చోటు దక్కించుకున్నాడు. అందివచ్చిన అవకాశాలను ఒడిసిపట్టిన ఈ 33 ఏళ్ల ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ అద్భుతంగా రాణించాడు. 48.71 సగటుతో ఇప్పటి వరకు 682 పరుగులు సాధించాడు.
తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన టీ20 బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాటింగ్ సంచలనం డేవిడ్ మలన్ దుమ్ములేపాడు. 877 రేటింగ్ పాయింట్లతో నంబర్‌వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన మలన్.. ఏకంగా నాలుగు స్థానాలు మెరుగుపరచుకున్నాడు. ఇటీవల జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లో మలన్ అద్భుతంగా రాణించాడు. పొట్టి ఫార్మాట్‌లో 16 మ్యాచ్‌లే ఆడిన మలన్ అతి తక్కువ కాలంలోనే నంబర్‌వన్ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం.