
మెల్‌బోర్న్: సుదీర్ఘ పర్యటనలో భాగంగా కంగారూల గడ్డపై భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్ట్ మ్యాచుల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అడిలైడ్ వేదికగా డే/నైట్ టెస్ట్ ముగిసింది. తొలి టెస్టులో ఆసీస్ ఘన విజయం సాధించింది. ఇక డిసెంబర్ 26 నుంచి మెల్‌బోర్న్ వేదికగా బాక్సింగ్‌డే టెస్టు ప్రారంభంకానుంది. అయితే ఈ టెస్టులో ఆస్ట్రేలియా సీనియర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఆడటం అనుమానంగా మారింది. వార్నర్ ఇంకా గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని సమాచారం తెలుస్తోంది. ఫిట్‌నెస్ కోసం అతడు తీవ్ర కసరత్తులు చేయిస్తున్నాడట.
భారత్, ఆస్ట్రేలియా మధ్య సిడ్నీ వేదికగా జరిగిన రెండో వన్డేలో డేవిడ్ వార్నర్ గాయపడ్డాడు.టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ బాదిన బంతిని అందుకునే క్రమంలో వార్నర్ డైవ్ చేయగా.. అతని గజ్జలో గాయమైంది. వెంటనే మైదానం వీడిన వార్నర్.. మళ్లీ మైదానంలోకి రాలేదు. ఆ తర్వాత చివరి వన్డేతో పాటు.. మూడు టీ20ల సిరీస్‌కి దూరమయ్యాడు. టెస్ట్ సిరీస్ సమయానికల్లా కోలుకుందనుకున్నా.. అది జరగలేదు. తొలి టెస్టుకీ దూరమయ్యాడు. పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్ సాధించిన తర్వాతే మళ్లీ ఆడుతానని ఇటీవల చెప్పిన వార్నర్.. రెండో టెస్టులో ఆడతానని ధీమా వ్యక్తం చేశాడు. కానీ ఇప్పటి వరకూ క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) నుంచి ఎలాంటి అప్‌డేట్ రాలేదు.
మెల్‌బోర్న్ టెస్టులోనూ ఓపెనర్లుగా మాథ్యూ వెడ్, జో బర్న్స్ బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. అడిలైడ్ టెస్టులో ఓపెనర్లుగా ఆడిన వెడ్, బర్న్స్.. తొలి ఇన్నింగ్స్‌లో 8, 8 పరుగులకే ఔట్ అయి నిరాశపరిచారు. ఒకే తరహాలో ఇద్దరూ ఔట్ అవడంతో ఆస్ట్రేలియాకు సరైన ఆరంభం దక్కలేదు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో 33, 51 పరుగులతో టచ్‌లోకి వచ్చారు. దీంతో మ్యాచ్ సమయానికల్లా డేవిడ్ వార్నర్ ఫిట్‌నెస్ సాధించలేకపోతే.. ఈ ఇద్దరే మెల్‌బోర్న్ టెస్టులోనూ ఆడే అవకాశం ఉంది.
బాక్సింగ్‌డే టెస్టులో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా ఎంపికైన ఆటగాడికి ప్రతిష్ఠాత్మక 'జానీ ముల్లఘ్' పతకాన్ని బహుకరిస్తామని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) సోమవారం ట్వీట్ చేసింది. 1868లో ఆస్ట్రేలియా తొలి అంతర్జాతీయ పర్యటన సందర్భంగా ఇంగ్లాండ్‌కు వెళ్లిన ఆ జట్టుకు జానీ ముల్లఘ్ కెప్టెన్‌గా వ్యవహరించారు. అతడి సేవలను గుర్తు చేసుకుంటూ భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే రెండో టెస్టులో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'ను ఈ విధంగా సన్మానిస్తున్నట్లు సీఏ వివరించింది.