
ఒక్క ఐపీఎల్ టైటిల్ గెలవలేదు:
'వార్నర్ కార్నర్' అనే పేరుతో డేవిడ్ వార్నర్ లైవ్ చాట్‌ను జానీ బెయిర్‌స్టోతో నిర్వహించాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఐపీఎల్ టైటిల్స్ గురించి చర్చ వచ్చింది. 'రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇప్పటివరకూ ఒక్క ఐపీఎల్ కూడా నెగ్గలేదు. విరాట్ కోహ్లీ ఈ వీడియో చూస్తున్నాడనుకుంటా' అని వార్నర్ పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ వంటి దిగ్గజ ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. బెంగళూరు జట్టు ఇప్పటివరకూ ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీ గెలవలేకపోయింది. రెండుసార్లు టోర్నీ ఫైనల్స్‌కు చేరి ఓటమిపాలైంది. ఈ విషయంలోనే కోహ్లీపై వార్నర్ సరదాగా సెటైర్ వేశాడు.

2016లో ఫైనల్లో ఓటమి:
2008 నుంచి ఐపీఎల్ జరుగుతుండగా ఇప్పటి వరకూ 12 సీజన్లు ముగిశాయి. కానీ బెంగళూరు మాత్రం ఒక్కసారి కూడా టైటిల్ విజేతగా నిలవలేకపోయింది. 2016లో డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఫైనల్స్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడింది. అయితే 209 పరుగుల లక్ష్య చేధనలో రాయల్ ఛాలెంజర్స్ విఫలమైంది. విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్‌లు కలిసి 10.3 ఓవర్లలో 114 పరుగులు చేయగా.. వారిద్దరు పెవిలియన్ చేరిన తర్వాత మిగితా ఆటగాళ్లు రాణించకపోవడంతో సన్‌రైజర్స్ విజేతగా నిలిచింది.

మా జట్టు డెత్ బౌలింగే బెస్ట్:
'మనకు మంచి జట్టు ఉంది. ఎక్కువ మంది బౌలర్లు ఉండడం మంచి విషయం. తొలి ఓవర్లలో మంచి స్వింగ్ బౌలింగ్ ఉంది. మన డెత్ బౌలింగ్ ఐపీఎల్‌లోనే అత్యుత్తమైనది. వికెట్ల మధ్య పరుగెత్తడాన్ని నేను ఇష్టపడతాను. వికెట్ల మధ్య మన పరుగు అద్భుతంగా ఉంది. అదే మనకు ఓ బలమైన అంశంగా ఉంది. మన విజయవంతమైన భాగస్వామ్యానికి ప్రధాన కారణం ఇదే కదా బెయిర్‌స్టో' అని వార్నర్ పేర్కొన్నాడు.

కోహ్లీ, వార్నర్ మధ్య ఆధిపత్య పోరు:
ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ మధ్య ఆధిపత్య పోరు గత కొన్ని సీజన్లుగా జరుగుతోంది. అయితే మునుపటిలా డేవిడ్ వార్నర్ నోరు జారడం లేదు. అయితే అవకాశం వచ్చినప్పుడల్లా కోహ్లీపై మాత్రం సెటైర్స్ వేస్తున్నాడు. కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ 2020 సీజన్ నిరవధికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. టోర్నీ జరిపేందుకు బీసీసీఐ అన్ని ప్రయత్నాలు చేస్తోంది.


Click it and Unblock the Notifications












