
హైదరాబాద్: గత కొన్ని రోజులుగా ప్రపంచ క్రికెట్‌ను కుదిపేసిన బాల్ టాంపరింగ్ వివాదంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కొందరు ఆసీస్ ఆటగాళ్లపై కొంత మంది వ్యక్తిగత దూషణకు దిగుతున్నారు. దీనిపై ఆస్ట్రేలియా క్రికెటర్లు ఫిర్యాదు చేయడాన్ని తప్పుబడుతూ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ చేసిన ట్వీట్ పెను దుమారం రేపుతోంది.
'ఇంత జరిగాక కూడా తమను వ్యక్తిగతంగా దూషిస్తున్నారని ఆస్ట్రేలియా క్రికెటర్లు అధికారికంగా ఫిర్యాదు చేయడం నాకు నవ్వు తెప్పిస్తోంది' అని మైకేల్ వాన్ ట్వీట్ చేశాడు.
మైకేల్ వాన్ చేసిన ట్వీట్ డేవిడ్ వార్నర్ భార్య క్యాండైస్ ఆగ్రహం తెప్పిందించింది. 'నీకు నవ్వు వస్తున్నదంటే నాకు ఆనందంగా ఉంది. అంటే.. నీ భార్యపిల్లలకు కూడా ఇదే పరిస్థితి ఎదురైతే దాన్ని నువ్వు ఆమోదిస్తావన్నమాట!' అని ఘాటుగా స్పందించింది.
దీంతో క్రికెటర్లపై 'వ్యక్తిగత దూషణ'ను తాను ప్రోత్సహించడం లేదని వాన్ వివరణ ఇచ్చుకున్నాడు. అయితే, దానిని తాను అంగీకరించబోనని, అయితే, మైదానంలో ఆటగాళ్ల ప్రవర్తన ఆధారంగానే బయట ప్రతిస్పందన వ్యక్తమవుతుందని, ఈ విషయాన్ని గుర్తించాలని వాన్ మరో ట్వీట్‌లో పేర్కొన్నాడు.
కేప్‌టౌన్ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా బౌలర్ బాన్‌క్రాఫ్ట్ బాల్ టాంపరింగ్‌కు ప్రోత్సహించినందుకు గాను ఆ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మీత్‌కు ఐసీసీ ఒక మ్యాచ్ నిషేధంతో పాటు, వంద శాతం జరిమానా విధించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ వివాదానికి బాధ్యత వహిస్తూ వైస్ కెప్టెన్సీ పదవి నుంచి డేవిడ్ వార్నర్ తప్పుకున్నాడు.