
సిడ్నీ: కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో విశ్వవ్యాప్తంగా క్రీడాటోర్నీలన్నీ రద్దు కాగా.. ఆటగాళ్లంతా ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్‌డౌన్ కారణంగా ప్రాక్టీస్‌కు దూరంగా ఉంటున్న ప్లేయర్లు సామాజిక మాధ్యమాల్లో మాత్రం హల్‌చల్ చేస్తున్నారు. ఇటీవలే టిక్‌టాక్‌లో అరంగేట్రం చేసిన ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ వరుస పెట్టి వీడియోలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. ఇక ఇంటర్వ్యూలు ఇవ్వడంతో పాటు చిత్ర విచిత్ర వేశాలతో అభిమానులను అలరిస్తున్నాడు.
ఇటీవల బాలీవుడ్ పాటలకు కూతురుతో కలిసి డ్యాన్స్ చేసిన డేవిడ్ వార్నర్.. తాజాగా మరోసారి కూతుళ్లతో కలిసి భారత ఆటగాళ్ల గురించి మాట్లాడాడు. ఓ చాట్ షోలో భాగంగా వార్నర్ మాట్లాడుతున్న సమయంలో అతడి వద్దకు వచ్చిన కూతుళ్లను మీ అభిమాన క్రికెటర్ ఎవరని అడిగితే.. విరాట్ కోహ్లీ తమ ఫేవరెట్ ఇండియన్ ప్లేయర్ అని చెప్పారు. అయితే ఓవరాల్‌గా వార్నర్ ఆట అంటే ఇష్టమని తెలిపారు. మరి కోహ్లీతో ఫోటో దిగడం ఇష్టమేనా అన్న ప్రశ్నకు వార్నర్ ఇద్దరు కూతుర్లు భారత కెప్టెన్‌తో సెల్ఫీ దిగాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు.
డేవిడ్ వార్నర్ మాట్లాడుతూ... 'ఇంగ్లండ్‌లో ప్రస్తుతం కరోనా మహమ్మారి తీవ్రత ఎక్కువగానే ఉంది. కరోనా ప్రభావం తగ్గితేనే మళ్లీ క్రీడలు ప్రారంభమయ్యేందుకు అవకాశం ఉంటుంది. అయితే మునుపటిలా మాత్రం స్టేడియాలు నిండకపోవచ్చు. ఇలా అయితే మాకు కూడా మ్యాచ్‌లు ఆడడం కష్టమవుతుంది. నేను మాత్రం ప్రేక్షకుల సమక్షంలో మ్యాచ్‌లు ఆడేందుకు ఇష్టపడతా. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఎక్కడ ఆడినా ప్రేక్షకుల మధ్యే ఆడాలని కోరుకుంటా. కరోనా కట్టడి కోసం ఆస్ట్రేలియా అద్భుతంగా పని చేస్తుంది' అని చెప్పుకొచ్చాడు.
వార్నర్ ఇప్పుడు టిక్‌టాక్ వీడియోలతో అలరిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే తన కూతురితో కలిసి కొన్ని వీడియోలు చేసిన వార్నర్.. ఇప్పుడు తన భార్య క్యాండిస్‌తో కలిసి ఓ వీడియో చేశాడు. అయితే తాజాగా చేసిన వీడియో వార్నర్‌లోని కొత్త కోణాన్ని చూపెట్టింది. వార్నర్ తన కాస్ట్యూమ్‌లో తొలుత ఆసీస్ జట్టు జెర్సీ వేసుకుని ఉన్నాడు. అతని వెనుక క్యాండిస్.. సర్ఫింగ్ కాస్ట్యూమ్‌లో బోటు నడుపుతున్నట్లు కనిపిస్తుంది. ఓ లైట్ మ్యూజిక్‌తో వీడియో సాగుతుంది. అయితే అకస్మాత్తుగా ఆ వీడియోలో ఇద్దరి ప్లేస్ మారుతుంది. వార్నర్ డ్రెస్సులో క్యాండిస్.. భార్య సర్ఫింగ్ కాస్ట్యూమ్‌లోకి డేవిడ్ మారుతాడు. బోటులో షికారుకు వెళుతున్నట్లు వార్నర్ పోజులిస్తాడు. ఇద్దరూ తమ పాత్రలను ఎక్సేంజ్ చేసుకుని అభిమానులకు వినోదాన్ని అందించారు.