

ఐపీఎల్ సీజన్-12లో ఇప్పటివరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆడింది ఆరు మ్యాచ్‌లే కదా.. మరి డేవిడ్ వార్నర్ ఏడో అర్ధ శతకం ఎలా చేసాడు అని ఆశర్యపోతున్నారా?. నిజమే డేవిడ్ వార్నర్ వరుసగా ఏడో అర్ధ శతకం బాదాడు. అయితే అది ఈ సీజన్‌లో మాత్రం కాదు.. పంజాబ్ జట్టుపై వరుసగా ఏడో అర్ధ శతకం నమోదు చేసాడు.
ఏకైక బ్యాట్స్‌మన్‌గా వార్నర్:
వార్నర్ పంజాబ్ జట్టుపై ఆడిన గత ఏడు మ్యాచ్‌ల్లో అర్ధ శతకాలు సాధించాడు. పంజాబ్‌పై వరుసగా 58, 81, 59, 52, 70, 51, 70 పరుగులు చేశాడు. ఐపీఎల్ చరిత్రలో రెండు జట్లపై వరుసగా ఏడు అర్ధ శతకాలు సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా వార్నర్ రికార్డుల్లోకి ఎక్కాడు. వార్నర్ ఇంతకుముందు 2014-16 మధ్య రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుపై వరుసగా ఏడు అర్ధ శతకాలు నమోదు చేసాడు.
పరుగుల వరద:
డేవిడ్ వార్నర్ బాల్ ట్యాంపరింగ్ ఉదంతంలో ఇరుక్కుని ఏడాది పాటు సస్పెన్షన్ కు గురయ్యాడు. ఈ ఏడాది మొదటిలో ఆస్ట్రేలియాలో జరిగిన బిగ్ బాష్ లీగ్‌లో పాల్గొని సత్తా చాటాడు. అనంతరం ఐపీఎల్-12లో ఎంట్రీ ఇచ్చి వచ్చి రావడంతోనే విరుచుకుపడ్డాడు. కలకతాతో జరిగిన మొదటి మ్యాచ్‌లోనే అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ ఆడిన 6 మ్యాచ్‌లలో.. డేవిడ్ వార్నర్ 3 అర్ధ సెంచరీలు, ఓ సెంచరీతో పరుగుల వరద పారిస్తున్నాడు. సోమవారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 70 పరుగులు చేశాడు. ఆరు మ్యాచ్‌ల్లో మొత్తం (10, 85, 69, 100, 15, 70) 349 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్‌ను తన దగ్గరే ఉంచుకున్నాడు.