
ఆర్చర్ బౌలింగ్‌లో గాయం
యాషెస్ సిరీస్‌లోనే స్టీవ్ స్మిత్ ఇంగ్లీష్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో తీవ్రంగా గాయపడ్డాడు. రెండో టెస్టులో 148 కిలోమీటర్ల వేగంతో ఆర్చర్ వేసిన ఓ బౌన్సర్ నేరుగా స్మిత్ తలకు తాకిం ది. నొప్పితో విలవిల్లాడి అక్కడే కుప్పకూలిన స్మిత్ రిటైర్డ్‌హర్ట్‌గా పెవిలియన్ చేరాడు. కాసేపటికే సిడిల్ (9) ఔటవడంతో మరోసారి క్రీజులోకి వచ్చిన స్మిత్.. పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే సెంచరీకి చేరువైన స్మిత్‌ను వోక్స్ వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో ఔట్ అయ్యాడు.

ఫిల్ హ్యూస్ మృతి
స్మిత్ తలకు అయిన గాయంను తలచుకుంటే కంగారూ క్రికెటర్లకు వెన్నులో వణుకుపుడుతుంది. ఎందుకంటే.. 2014లో ఆ జట్టు ఆటగాడు ఫిల్ హ్యూస్ షెఫీల్డ్ షీల్డ్ క్రికెట్ ఆడుతూ గాయపడ్డాడు. తలకు బంతి బలంగా తగలడంతో.. అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. దీంతో నాటి నుంచి ఆసీస్ బ్యాట్స్‌మెన్ బౌన్సర్లను ఎదుర్కోవాలంటే కాస్త భయపడుతున్నారు. ఇక స్మిత్ తలకు అయిన గాయంతో ఒక్కసారిగా భయపడ్డారు.

ఫిల్ హ్యూస్‌లా కాకూడదని కోరుకున్నాం
స్టీవ్ స్మిత్ తలకు గాయమైనప్పుడు అందరం కంగారు పడ్డామని ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తెలిపాడు. ఆస్ట్రేలియాలో క్రికెట్‌పై అమెజాన్ ప్రైమ్ 'ది టెస్ట్' అనే డాక్యుమెంటరీ వీడియో విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి హాజరైన వార్నర్.. గత యాషెస్ అనుభవాలను పంచుకున్నాడు. 'స్మిత్ తలకు బంతి తగిలి కిందపడగానే మళ్లీ అలా (ఫిల్ హ్యూస్) కాకూడదని కోరుకొన్నాం. మేమంతా చాలా కంగారు పడ్డాం. స్మిత్‌కు అలాంటి పరిస్థితి రావొద్దని ప్రార్థించాం' అని వార్నర్ చెప్పాడు.

ఒక్కసారిగా షాకయ్యా
ఇదే విషయంపై పీటర్ సిడిల్ స్పందిస్తూ... 'స్మిత్ కిందపడగానే ఒక్కసారిగా షాకయ్యా. జట్టు సభ్యులు, మేనేజ్మెంట్ అందరం ఆందోళనకు గురయ్యాం. ఆ తర్వాత తేరుకున్నాం' అని అన్నాడు. ఉస్మాన్ ఖవాజా మాట్లాడుతూ... 'బంతి అలా తగులుతుందని అసలు ఊహించలేదు. నేను చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడుతున్నా.. హ్యూస్ కన్నుమూసే వరకు క్రికెట్‌లో అలా బంతి తగిలి ఆటగాళ్లు మరణిస్తారనే విషయం నాకు తెలియదు' అని పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications












