
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. బిగ్‌బాష్ లీగ్ (BBL)కి తొమ్మిదేళ్ల పాటు దూరమైన వార్నర్ తన ఎడబాటును ఇక ముగించాడు. సిడ్నీ థండర్ జట్టుతో మళ్లీ రెండేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు అతనితో సంప్రదించి చర్చలు జరపడంతో మళ్లీ డేవిడ్ వార్నర్ బిగ్ బాష్ లీగ్ ఆడడానికి సిద్ధమయ్యాడు. అతను ఐదు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండబోతున్నాడు. వార్నర్ థండర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం ఇది మూడోసారి మాత్రమే.
గతంలో అతను కెప్టెన్‌గా 2011-12లో ఒక్క మ్యాచ్ 2013-14లో ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు. తొలిసారి మెల్‌బోర్న్ స్టార్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 102నాటౌట్‌గా నిలిచి సత్తా చాటాడు. రెండో సారి సిడ్నీ సిక్సర్‌లపై 31బంతుల్లో హాఫ్ సెంచరీతో అలరించాడు.
వార్నర్ 2012-13 ఎడిషన్‌లో సిడ్నీ సిక్సర్స్‌కు కూడా ఆడాడు. అయితే సిడ్నీ సిక్సర్ తరఫున ఆడినప్పుడు థండర్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను రెండో బంతికి డకౌట్ అయ్యాడు. ఇకపోతే బిగ్ బాష్ లీగ్‌లో వార్నర్ తిరిగి ఎంట్రీ ఇవ్వబోతుండడంపై స్పందించాడు. 'నేను బిగ్ బాష్ లీగ్‌లో ఏ జట్టుకైతే తొలిసారి ఆడానో.. మళ్లీ ఆ జట్టులో చేరి తిరిగి బిగ్ బాష్ లీగ్‌లో ఆడబోతుండడం నిజంగా సంతోషంగా ఉంది. ' అని వార్నర్ పేర్కొన్నాడు.
బీబీఎల్ భవిష్యత్తు అలాగే తదుపరి తరం ఆటగాళ్లకు ప్రయోజనం చేకూర్చేందుకు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు చేస్తున్న ప్రయత్నాలు ఫలించాలని అందులో భాగంగా నేను బిగ్ బాష్ లీగ్‌లో ఆడుతున్నందుకు సంతోషంగా ఉందని' వార్నర్ చెప్పాడు.బీబీఎల్‌కి తిరిగి రావాలనే తన నిర్ణయాన్ని ప్రభావితం చేసింది తన కుటుంబమే అని వార్నర్ పేర్కొన్నాడు. నా బిడ్డలిద్దరు.. నేను బీబీఎల్‌లో ఆడితే చూడటానికి ఇష్టపడతారని నాతో చెప్పారు. కుటుంబంతో కలిసి బీబీఎల్లో భాగం కావడం మాకు చాలా ఆనందించే విషయం' అని వార్నర్ చెప్పాడు.