
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో గాయపడిన ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కోలుకున్నాడు. టీమిండియాతో జరిగే వన్డే సిరీస్ కోసం అతను రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలో ముంబై చేరుకున్న వార్నర్.. అక్కడ తన అభిమానులతో కలిసి రోడ్డుపై క్రికెట్ ఆడాడు. దీనికి సంబంధించిన వీడియోను అతను తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో షేర్ చేశాడు. ఇప్పుడీ వీడియో తెగ వైరల్ అవుతోంది.
భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే మ్యాచ్‌కు ముంబై ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. దీని కోసం ఇక్కడకు చేరుకున్న వార్నర్.. రోడ్డుపై షికార్లు కొడుతూ తన అభిమానులను కలిశాడట. వాళ్లతో కలిసి రోడ్డుపై క్రికెట్ ఆడిన వీడియోను షేర్ చేస్తూ.. 'సైలెంట్‌గా ఉన్న వీధి దొరికింది. అందుకే ఇలా' అని పోస్టు పెట్టాడు. భారత్‌తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌లో తొలి రెండు మ్యాచుల్లో వార్నర్ ఆడిన సంగతి తెలిసిందే. ఈ రెండు మ్యాచుల్లో పెద్దగా రాణించని అతనికి ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టెస్టులో గాయమైంది. దీంతో మిగతా రెండు మ్యాచులకు దూరమయ్యాడు.
బాలీవుడ్, టాలీవుడ్ పాటలకు డ్యాన్సులు వేస్తూ.. ఫేస్ మార్ఫింగ్ చేస్తూ వీడియోలు షేర్ చేసే వార్నర్‌కు భారత్‌లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువగానే ఉంది. సన్‌రైజర్స్ కెప్టెన్‌గా ఐపీఎల్ ట్రోఫీ కూడా నెగ్గిన అతన్ని ఈ జట్టు యాజమాన్యం అర్ధంతరంగా జట్టులో నుంచి తొలగించి దుమారం రేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో వార్నర్ ఉన్నాడు. యాక్సిడెంట్ కారణంగా రిషభ్ పంత్ ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరం అవడంతో వార్నర్‌కే ఈ ఏడాది జట్టు పగ్గాలు ఇవ్వాలని ఢిల్లీ క్యాపిటల్స్ భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటనా రాలేదు. అయితే ఆ జట్టు సన్నిహిత వర్గాలు మాత్రం వార్నర్‌కే జట్టు పగ్గాలు ఇస్తున్నట్లు చెప్తున్నాయి.