యాషెస్ సిరీస్ 2021లో ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను దురదృష్టం వెంటాడుతుంది. మంచి ప్రదర్శనతో వరుస టెస్టుల్లో భారీ ఇన్నింగ్స్‌లు ఆడుతున్నప్పటికీ సెంచరీకి చేరువగా వచ్చి ఔట్ అయిపోతున్నాడు. బ్రిస్బేన్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లోని తొలి ఇన్నింగ్స్‌లో, ప్రస్తుతం ఆడిలైడ్ వేదికగా డే అండ్ నైట్‌గా జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నిగ్స్‌లో వార్నర్ బాబాయి 90 పైగా పరుగులు చేసి ఔటయ్యాడు. రెండుసార్లు సెంచరీకి చేరువగా వచ్చి ఔటవడంతో వార్నర్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.
బ్రిస్బేన్ వేదికగా జరిగిన యాషెస్ తొలి టెస్టులోని తొలి ఇన్నింగ్స్‌లో వార్నర్ 176 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 94 పరుగులు చేసి సెంచరీకి 6 పరుగుల దూరంలో ఔట్ అయ్యాడు. తాజాగా ఆడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులోని తొలి ఇన్నింగ్స్‌లోనూ 167 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో 95 పరుగులు చేసి సెంచరీకి మరో 5 పరుగుల దూరంలోనే వార్నర్ ఔట్ అయిపోయాడు. దీంతో అభిమానులంతా అయ్యో పాపం డేవిడ్ వార్నర్ అంటున్నారు.
వార్నర్ అదరహో.. 20 ఇన్నింగ్స్‌లో 10 సార్లు 50+ స్కోర్లు
యాషెస్ సిరీస్‌ల్లో ఆస్ట్రేలియా సీనియర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ దుమ్ము రేపుతున్నాడు. స్వదేశంలో ఆడిన 20 యాషెస్ సిరీస్ ఇన్నింగ్స్‌లో వార్నర్ ఏకంగా 10 సార్లు 50కి పైగా పరుగులు సాధించాడు. అంతే కాకుండా యాషెస్ సిరీస్‌లో ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్‌గా వార్నర్ అరుదైన ఘనత సృష్టించాడు. దీంతో వార్నర్‌పై అభిమానులతోపాటు మాజీ క్రికెటర్లు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా తన టెస్ట్ కెరీర్లో ఇప్పటివరకు 88 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన వార్నర్ 48కి పైగా సగటుతో 7,500 పరుగులు చేశాడు. ఇందులో 24 సెంచరీలు, 32 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
రెండు సార్లు డబుల్ సెంచరీ సాధించడంతోపాటు ఓ సారి ట్రిపుల్ సెంచరీ కూడా అందుకున్నాడు. టెస్టు క్రికెట్లో వార్నర్ వ్యక్తిగత స్కోర్ 335 పరుగులు. ఇక ఆడిలైడ్ టెస్టు మ్యాచ్ విషయానికొస్తే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా స్టడీగా బ్యాటింగ్ చేస్తోంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోర్ 210-2.4 పరుగులకే తొలి వికెట్ కోల్పోయినప్పటికీ మార్నస్ లాబుస్చాగ్నేతో కలిసి వార్నర్ జట్టును ఆదుకున్నాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు ఏకంగా 172 పరుగులు జోడించారు.