
పేలవ ఫామ్‌లో వార్నర్..
గత మూడు టెస్టు మ్యాచుల్లో వార్నర్ పెద్దగా రాణించలేదు. వరుసగా 5, 48, 21, 28, 0, 3 స్కోర్లు చేశాడు. ఈ క్రమంలో జట్టులో అతని స్థానం ప్రశ్నార్థకమైంది. చాలా మంది మాజీలు కూడా వార్నర్ పని అయిపోయిందని, టెస్టు క్రికెట్‌కు అతను వీడ్కోలు చెప్పేస్తే మంచిదని అన్నారు.
వాళ్లందరికీ బ్యాటుతోనే వార్నర్ సమాధానం చెప్పాడు. రెండో రోజు 45/1 స్కోరుతో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. మ్యాచ్ ఆరంభమైన కాసేపటికే మార్నస్ లబుషేన్ (14) రనౌట్ అయ్యాడు.

స్మిత్‌తో భారీ భాగస్వామ్యం
లబుషేన్ అవుటైన తర్వాత స్టీవెన్ స్మిత్ (86) క్రీజులోకి వచ్చాడు. స్మిత్, వార్నర్ ఇద్దరూ కలిసి మూడో వికెట్‌కు భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. వీళ్లిద్దరూ 239 పరుగుల భాగస్వామ్యం ఏర్పరిచారు. దీంతో ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా సాగింది. స్మిత్ కూడా సెంచరీ చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ భారీ షాట్‌కు ప్రయత్నించే క్రమంలో టైమింగ్ మిస్ అయిన అతను.. క్యాచ్ అవుట్‌గా పెవిలియన్ చేరాడు. స్మిత్ అవుటైన తర్వాత కూడా వార్నర్ తన విధ్వంసాన్ని కొనసాగించాడు.

డబుల్ సెంచరీ పూర్తవగానే..
చాలా కాలం తర్వాత తనకు వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న వార్నర్.. ఈ మ్యాచ్‌లో చెలరేగాడు. తన ఇన్నింగ్స్‌లో 16 ఫోర్లు, రెండు భారీ సిక్సర్ల సాయంతో డబుల్ సెంచరీ చేశాడు. 196 పరుగుల వద్ద ఉన్న సమయంలో ఎడ్జ్ తీసుకున్న బంతి స్లిప్ ఫీల్డర్ పక్క నుంచి బౌండరీకి వెళ్లింది.
అప్పటికే తొడ కండరాలు పట్టేసి బాధ పడుతున్న వార్నర్.. అభిమానుల కోసం తనదైన స్టైల్‌లో ఎమోషనల్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. పెద్దగా గర్జిస్తూ పైకెగిరి సంతోషం వ్యక్తం చేశాడు. అప్పటికే అలిసిపోయి ఉన్న అతను ఆ తర్వాత ఇక ఆడలేక రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడాడు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ జట్టు మూడు వికెట్ల నష్టానికి 386 పరుగులతో నిలిచింది.


Click it and Unblock the Notifications
