
హైదరాబాద్: బాల్ టాంపరింగ్‌కు పాటు ఏడాది పాటు నిషేధానికి గురైన ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో ఆడనున్నాడు. ఈ మేరకు డేవిడ్ వార్నర్‌తో సెయింట్ లుసికా స్టార్స్ జట్టు ఒప్పందం కుదుర్చుకుంది.
టోర్నీలో భాగంగా డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియాకు చెందిన డిఆర్సీ షార్ట్ స్థానాన్ని భర్తీ చేయనున్నాడు. ఆస్ట్రేలియా-ఏ జట్టు ఈ ఏడాది ఆగస్టు నెలలో ఇండియాలో పర్యటించనుంది. భారత్ పర్యటనకు రానున్న ఆస్ట్రేలియా-ఏ జట్టులో డిఆర్సీ షార్ట్ చోటు దక్కించుకున్నాడు.
దీంతో కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో సెయింట్ లుసికా స్టార్స్ జట్టు తరుపున ఆడుతున్న డిఆర్సీ షార్ట్ టోర్నీకి దూరం కానున్నాడు. ఈ నేపథ్యంలో షార్ట్ స్థానంలో డేవిడ్ వార్నర్‌ను ఆ జట్టు యాజమాన్యం ఎంపిక చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా అనేక టీ20 టోర్నీల్లో అనేక జట్లకు ప్రాతినిథ్యం వహించిన వార్నర్ తొలిసారి సీపీఎల్‌లో ఆడనున్నాడు.
మార్చి 2012 తర్వాత డేవిడ్ వార్నర్ కబేరియన్ గడ్డపై టీ20 క్రికెట్ ఆడేందుకు తొలిసారి వెళ్తున్నాడు. డేవిడ్ వార్నర్ ఇప్పటివరకు 243 టీ20లు ఆడగా... అందులో 70 అంతర్జాతీయ టీ20లు ఉన్నాయి. టీ20ల్లో మొత్తం వార్నర్ 7,668 పరుగులు చేయగా, ఇందులో ఆరు సెంచరీలు ఉన్నాయి.
ఆగస్టు 8 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో డేవిడ్ వార్నర్ ఆడటం ద్వారా ఎక్కువ మంది అభిమానులు స్టేడియాలకు వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు వార్నర్‌కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. కాగా, కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో తాను ఆడనున్న విషయాన్ని వార్నర్ తన అధికారిక ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నాడు. తమ జట్టులో వార్నర్ భాగస్వామ్యం కాబోతున్నందుకు సంతోషంగా ఉందని ఆ ఫ్రాంఛైజీ జనరల్ మేనేజర్ మహ్మద్ ఖాన్ తెలిపారు. సీపీఎల్ వచ్చే ఆగస్టు 8 నుంచి సెప్టెంబర్ 16 మధ్య జరగనుంది.