హైదరాబాద్: భారత క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. ఐపీఎల్ ద్వారా డేవిడ్ వార్నర్ భారత క్రికెట్ అభిమానులకు బాగా దగ్గరయ్యాడు.
అలాంటి స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ భారత్‌లోని రోడ్లపై నడుచుకుంటూ వెళ్తుంటే ఫ్యాన్స్ ఊరుకుంటారా? నాలుగు టెస్టుల కోసం ఆసీస్ జట్టు భారత పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బెంగుళూరులో ఫిబ్రవరి 4 నుంచి జరగనున్న రెండో టెస్టు కోసం ఇప్పటికే ఇరు జట్లు బెంగుళూరుకు చేరుకున్నాయి.

ఈ క్రమంలో శుక్రవారం ఉదయం తన కూతురు ఐవీ వార్నర్‌తో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. వార్నర్‌ను గమనించిన అభిమానులు సెల్ఫీల కోసం పోటీ పడ్డారు. అయితే వార్నర్ కూతురు ఐవీ మాత్రం తనకు ఏమీ తెలియనట్టు అలా ఒంటరిగా ముందుకు నడుచుకుంటూ వెళ్లిపోయింది.
తొలుత వార్నర్‌తో కలిసి నడిచేందుకు ప్రయత్నించినా, అభిమానులు ఎంతకీ అతడిని వదలకపోవడంతో అలిగి పక్కకు వెళ్లింది. కోపంతో తన చేతిలో ఉన్న లాలీపాప్‌ను కూడా నేలకేసి కొట్టింది. ఈ తతంగం మొత్తాన్ని వార్నర్ భార్య వీడియో తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో హల్ చల్ చేస్తోంది.
ఈ వీడియోని చూసిన వార్నర్ సైతం ఫ్యాన్స్‌తో సెల్ఫీలు దిగడాన్ని ఐవీ ఓర్చుకోలేకపోయిందంటూ నవ్వుతూ ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు.