
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్టులో టీమిండియా బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు ఈ మ్యాచ్‌లో కూడా తొలి ఓవర్లోనే షాక్ తగిలిందని అంతా అనుకున్నారు. షమీ బౌలింగ్‌లో డేవిడ్ వార్నర్ ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీల్ చేయగా.. అంపైర్ అవుటిచ్చాడు. అయితే తన బ్యాటుకు బంతి తాకిందని బలంగా నమ్మిన వార్నర్ వెంటనే రివ్యూ కోరాడు.
రిప్లేలో బ్యాటును బంతి తాకినట్లు తేలింది. దీంతో బతికిపోయిన వార్నర్ డిఫెన్సివ్‌గానే ఆడాడు. అయితే మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా కొన్ని లక్కీ షాట్లు బౌండరీ వెళ్లడంతో బాగానే పరుగులు చేశాడు. పిచ్ నుంచి పేసర్లతోపాటు స్పిన్నర్లకు కూడా మంచి సహకారం లభించడంతో బ్యాటర్లు కొంత తడబడ్డారు. షమీ, సిరాజ్ ఇద్దరూ తమ పేస్, బౌన్సర్లతో వార్నర్, ఖవాజాను బెంబేలెత్తించారు. అశ్విన్ కూడా తన సూపర్ స్పిన్‌తో వాళ్లకు ముచ్చెమటలు పట్టించాడు.
కానీ భారత్‌కు వికెట్లు దక్కలేదు. తొలి గంట గడిచిన తర్వాత కూడా ఒక్క వికెట్ కూడా పడలేదు. అయితే డ్రింక్స్ తర్వాత షమీ బౌలింగ్‌లో భారత్‌కు తొలి బ్రేక్ దక్కింది. షమీ వేసిన బంతిని బ్యాక్‌ఫుట్‌లో డిఫెండ్ చేసుకోవడానికి వార్నర్ ప్రయత్నించాడు. ఈ సమయంలో ఎడ్జ్ తీసుకున్న బంతి నేరుగా కీపర్ కేఎస్ భరత్ వైపు వెళ్లింది. అతను ఎలాంటి పొరపాటు చేయకుండా క్యాచ్ పట్టేయడంతో వార్నర్ నిరాశగా పెవిలియన్ చేరాల్సి వచ్చింది. తొలి టెస్టులో ఘోరంగా ఫెయిలైన వార్నర్.. ఈ మ్యాచులో కూడా కేవలం 15 పరుగులు మాత్రమే చేశాడు. అశ్విన్ కూడా అద్భుతంగా స్పిన్ చేస్తుండటంతో ఆసీస్‌కు తిప్పలు తప్పవని నిపుణులు అంటున్నారు. మరి తర్వాత ఏం జరుగుతుందో చూడాలి.