హైదరాబాద్: గత కొంతకాలంగా అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ సరికొత్త రికార్డుని సృష్టించాడు. వన్డేల్లో నాలుగు వేల పరుగుల్ని అత్యంత వేగంగా సాధించిన ఆస్ట్రేలియా క్రికెటర్‌గా అరుదైన ఘనత సాధించాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా సోమవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ ఈ ఘనత సాధించాడు. 93 ఇన్నింగ్స్‌ల్లో డేవిడ్ వార్నర్ ఈ మైలురాయిని అందుకున్నాడు. కాగా, అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ ఘనతను అత్యంత వేగవంతంగా సాధించిన క్రికెటర్ల పరంగా చూస్తే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాడు.
వన్డేల్లో నాలుగు వేల పరుగులు సాధించడానికి డేవిడ్ వార్నర్‌కు ఎనిమిదేళ్లు పట్టింది. కాగా సోమవారం ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు సునాయసంగా గెలిచే అవకాశం ఉన్నప్పటికీ.. కుండపోతగా కురిసిన వర్షంతో ఈ మ్యాచ్‌ని రద్దు అయింది.

దీంతో గెలిచే మ్యాచ్‌లోనూ చెరో పాయింట్‌తో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇరు జట్లకు అంఫైర్లు చెరో పాయింట్ ఇచ్చారు. టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియా తన తోలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో కూడా వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో అప్పుడు కూడా ఒక పాయింట్‌తో ఆస్ట్రేలియా సరిపెట్టుకుంది.
ప్రస్తుతం టోర్నీలో రెండు మ్యాచ్‌లు ఆడిన ఆస్ట్రేలియా రెండుపాయింట్లతో కొనసాగుతోంది. సెమీఫైనల్‌లో అడుగుపెట్టాలంటే ఇంగ్లాండ్‌తో జూన్ 10న జరగనున్న చివరి మ్యాచ్‌లో కచ్చితంగా గెలిచి తీరాల్సిందే. మరోవైపు వర్షం బంగ్లాదేశ్‌కు కలిసొచ్చింది. ఈ మ్యాచ్‌లో కనుక బంగ్లాదేశ్ ఓడి ఉంటే ఆ జట్టు సెమీఫైనల్ రేసు నుంచి తప్పుకునేది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ మిచెల్ స్టార్క్ (4/29), ఆడమ్ జంపా (2/13)లతో పాటు మిగతా బౌలర్లూ రాణించడంతో బంగ్లాదేశ్ 44.3 ఓవర్లలో 182 పరుగులకే ఆలౌటైంది. అనంతరం 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. 16 ఓవర్లలో వికెట్ నష్టానికి 83 పరుగులు చేసిన దశలో వర్షం వల్ల మ్యాచ్ ఆగిపోయింది.
వర్షంతో ఆట నిలిచే సమయానికి క్రీజులో వార్నర్ (44 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు), స్మిత్ (25 బంతుల్లో 22 నాటౌట్; 1 ఫోర్) ఉన్నారు. ఫించ్ (19) అవుటయ్యాడు. డక్‌వర్త్/లూయిస్ పద్ధతి ప్రకారం ఆసీస్ విజయానికి అవసరమైన పరుగులు సాధించింది. మరో నాలుగు ఓవర్లు మ్యాచ్ కొనసాగి ఉంటే ఈ మ్యాచ్‌లో విజయం ఆసీస్‌ను వరించేది.
కానీ రెండో ఇన్నింగ్స్‌లో కనీసం 20 ఓవర్ల ఆట అయితే తప్ప ఈ పద్ధతిలో విజేతను ప్రకటించరు. కానీ వరుణుడు ఎంతకు తెరిపినివ్వకపోవడంతో అంఫైర్లు ఇక మ్యాచ్ జరగడం వీలుకాదని తేల్చేసి ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు.