
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ దాదాపు తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత బిగ్ బ్యాష్ లీగ్‌లో ఆడాడు. అయితే అతని రీఎంట్రీ ఆ జట్టుకు ఏమాత్రం ఉపయోగపడలేదు. వార్నర్ కూడా రీఎంట్రీలో పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో సిడ్నీ థండర్ జట్టు చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పెర్త్ స్కార్చర్స్ కెప్టెన్ ఆష్టన్ టర్నర్ మరో ఆలోచన లేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. అతని నిర్ణయం కరెక్టే అని నిరూపించిన బౌలర్లు విజృంభించారు.
పెర్త్ బౌలర్లు చెలరేగడంతో సిడ్నీ బ్యాటర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఓలివర్ డేవీస్ (52), నాథన్ మెక్‌ఆండ్రూ (21), డేవిడ్ వార్నర్ (19) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. మిగతా ఆటగాళ్లు అందరూ సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితం అయ్యారు. దీంతో సిడ్నీ థండర్ జట్టు 19 ఓవర్లలో కేవలం 111 పరుగులకే ఆలౌట్ అయిపోయింది. పెర్త్ బౌలర్లలో ఆండ్రూ టై మూడు వికెట్లతో చెలరేగాడు. డేవిడ్ పేన్, లాన్స్ మోరిస్, మాథ్యూ కెల్లీ తలో రెండు వికెట్లు తీసుకోగా.. ఆష్టన్ అగర్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
ఛేజింగ్‌లో పెర్త్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్లు ఇద్దరూ ధనా ధన్ ఆటతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. అయితే స్టీఫెన్ ఎస్కినాజి (40) హాఫ్ సెంచరీని త్రుటిలో చేజార్చుకున్నాడు. కానీ మరో ఓపెనర్ కామెరూన్ బాంక్రాఫ్ట్ (53 నాటౌట్) మాత్రం తొందరపడకుండా జాగ్రత్తగా ఆడుతూ అర్ధశతకం పూర్తిచేసుకున్నాడు. ఎస్కినాజి అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన ఆరోన్ హార్డీ (11 నాటౌట్) అతనికి మంచి సహకారం అందించాడు. దీంతో పెర్త్ జట్టు కేవలం 12.5 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మూడు వికెట్లతో చెలరేగిన ఆండ్రూ టైకి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.