వార్నర్ ఊచకోత.. టీ20లలో తొలి సెంచరీ.. 134 పరుగులతో శ్రీలంకపై ఆసీస్ విజయం

అడిలైడ్: విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్, భారీ హిట్టర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఊచకోత కోయడంతో శ్రీలంకతో ఆదివారం జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా 134 పరుగులతో ఘన విజయం సాధించింది. మొదటగా వార్నర్ సెంచరీతో చెలరేగగా.. అనంతరం బౌలర్లు లంక బ్యాట్స్‌మన్‌ను ఓ ఆటాడుకున్నారు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆసీస్ జట్టు టీ20ల్లోనే అత్యుత్తమ విజయం సాధించింది. 134 పరుగుల తేడాతో లంకపై గెలిచి రికార్డు సృష్టించింది. గత ఏడాది వెస్టిండీస్‌పై పాకిస్తాన్ 143 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీ20లలో ఇదే అతిపెద్ద విజయం.

సత్తాచాటిన వార్నర్:
టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ లసిత్ మలింగ బౌలింగ్ ఎంచుకున్నాడు. తన నిర్ణయం ఎంత తప్పో మలింగ త్వరలోనే తెలుసుకున్నాడు. ఓపెనర్లు ఆరోన్ ఫించ్ (64; 36 బంతుల్లో 8x4, 3x6), డేవిడ్ వార్నర్ (100; 56 బంతుల్లో 10x4,4x6) ఇన్నింగ్స్ ఆరంభం నుండే లంక బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఇద్దరు ఫోర్లు, సిక్సులే లక్ష్యంగా ఆడారు. లంక బౌలర్లపై ఎదురుదాడికి దిగి ఓవర్‌కి 10కి పైగా రన్ రేట్ సాధించారు. ఫించ్, వార్నర్‌లు ఆకాశమే హద్దుగా చెలరేగుతూ తొలి వికెట్‌కు 122 పరుగులు జోడించారు.

మ్యాక్స్‌వెల్ ఊచకోత:
అర్ధ సెంచరీ అనంతరం ఫించ్ పెవిలియన్ చేరినా.. ఆసీస్ స్కోర్ వేగం మాత్రం తగ్గలేదు. వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్‌గా వచ్చిన హిట్టర్ మ్యాక్స్‌వెల్ (62; 28 బంతుల్లో 7x4, 3x6) కూడా లంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో తక్కువ బంతుల్లో అర్ధ సెంచరీ చేసాడు. మరోవైపు వార్నర్ కూడా దూకుడుగా ఆడుతూ టీ20లలో తొలి సెంచరీ సాధించాడు. చివరి ఓవర్లో మ్యాక్స్‌వెల్ ఔట్ అయినా.. ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 233 పరుగుల భారీ స్కోర్ చేసింది.

ఆసీస్ బౌలర్ల విజృంభణ:
లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 99 పరుగులే చేసి భారీ ఓటమిని మూటగట్టుకుంది. దసున్ షనక (17) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆసీస్ బౌలర్ల ధాటికి ఓపెనర్ మెండిస్ (0) డకౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ దనుష్క గుణతిలక (11), భానుక రాజపక్సే (2) కూడా త్వరనే పెవిలియన్ బాట పట్టారు. కుసల్ పెరెరా (16), ఓషాడా ఫెర్నాండో (13), దాసున్ షనక ఆదుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఆసీస్ బౌలర్లు చెలరేగడంతో లంక ఆటగాళ్లు పరుగులు చేయడంలో విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో స్పిన్నర్ ఆడం జంపా మూడు వికెట్లు తీయగా.. పాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్ రెండేసి వికెట్లు పడగొట్టారు.

తొలిసారి పొట్టి ఫార్మాట్‌లో:
'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' సెంచరీ చేసిన డేవిడ్ వార్నర్‌కు దక్కింది. రెండో టీ20 మ్యాచ్ ఈనెల 30న గబ్బాలో జరగనుంది. బాల్ ట్యాంపరింగ్ వివాదంతో ఏడాది నిషేధం ఎదుర్కొన్న మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు తొలిసారి పొట్టి ఫార్మాట్ బరిలో దిగారు. పక్క టెముకల గాయంతో బాధ పడుతున్న ఆస్ట్రేలియా వన్డే, టీ20 కెప్టెన్ అరోన్ ఫించ్ అర్ధ సెంచరీతో ఫిట్‌నెస్ నిరూపించుకున్నాడు. టీ20 డెత్ ఓవర్ స్పెషలిస్టుగా పేరుతెచ్చుకున్న అండ్రూ టై మోచేతి గాయం కారణంగా సిరీస్‌కు దూరమయిన విషయం తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications