హైదరాబాద్: ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా రెండో వన్డే కోసం ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికే కోల్‌కతాకు చేరుకుంది. ఆసీస్ జట్టులో ఓపెనర్ డేవిడ్ వార్నర్ భారత్‌లో అత్యధిక అభిమానులను సంపాదించుకున్న ఆటగాళ్లలో ఒకడు. గతేడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సన్ రైజర్స్ హైదరాబాద్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు.
అంతేకాదు ఐపీఎల్‌లో ఎన్నో మ్యాచ్‌లను ఒంటిచేత్తో గెలిపించాడు. ఐదు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ కోసం స్టీవ్ స్మిత్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తోంది. చెన్నైలో జరిగిన తొలి వన్డే ముగిసిన తర్వాత ఇరు జట్లు రెండో వన్డే కోసం కోల్‌కతాకు చేరుకున్నాయి.
ఇరు జట్ల మధ్య గురువారం రెండో వన్డే జరగనుంది. ఈ క్రమంలో కాస్తంత విరామం లభించడంతో తన భార్య, ఇద్దరు పిల్లలతో కోల్‌కతాలోని చూడదగ్గ ప్రదేశాలను చుట్టిరావాలని డేవిడ్ వార్నర్ అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా 'గుడ్ మార్నింగ్ కోల్‌కతా, నగరంలో సందర్శించ తగ్గ ప్రాంతాలేవో చెప్తారా' అని ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు.
ఈ నేపథ్యంలో భారత క్రికెట్ అభిమానులు కోల్‌కతాలో అన్నింటి కన్నా ముందుగా దాదా ఇంటిని దర్శించాలని వార్నర్‌కు సూచించారు. 'మీరు కచ్చితంగా గంగూలీ ఇంటిని దర్శించాల్సిందే. బతికున్న ఓ ప్రిన్స్ రాజ్యాన్ని చూస్తున్న అనుభూతి మీకు కలుగుతుంది' అని ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.