
హైదరాబాద్: పాకిస్థాన్ వరల్డ్ రికార్డుకి సఫారీలు అడ్డుపడ్డారు. వరుసగా 11 టీ20 సిరిస్ విజయాలను సొంతం చేసుకుని ప్రపంచ రికార్డు నెలకొల్పిన పాకిస్థాన్ జోరుకు సఫారీ జట్టు ఆదివారం బ్రేక్ వేసింది. ఆదివారం వాండరర్స్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు 7 పరుగుల తేడాతో విజయం సాధించింది.
దీంతో వరుసగా 11 సిరీస్‌లు గెలుపొందిన పాక్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. తొలి టీ20లో నాలుగు క్యాచ్‌లు, రెండు రనౌట్లతో ఫీల్డర్‌గా సత్తా చాటిన మిల్లర్.. రెండో టీ20లో బ్యాట్‌తో మెరిశాడు. డుప్లెసిస్ గైర్హాజరీలో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన మిల్లర్ రెండో టీ20లో 29 బంతుల్లో 65 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టులో మిల్లర్‌కి తోడు హెండ్రిక్స్ (28), మలాన్ (33), డస్సెన్ (45) రాణించడంతో దక్షిణాఫ్రికా 3 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. అనంతరం 189 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 7 వికెట్ల నష్టానికి 181 పరుగులకే పరిమితమైంది.
పాక్ జట్టులో బాబర్ ఆజమ్ (90), హుస్సేన్ తలాత్ (55) రాణించినప్పటికీ.. మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయకపోయారు. గత మూడేళ్లలో పాక్ టీ20 సిరీస్ కోల్పోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. వరుసగా రెండో టీ20లోనూ మిల్లర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.