హైదరాబాద్: దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ మిల్లర్ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన క్రికెటర్‌గా అరుదైన ఘనత సాధించాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టీ20లో డేవిడ్ మిల్లర్ ఈ ఘనత సాధించాడు. 35 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్సుల సాయంతో 101* పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
హాఫ్ సెంచరీ చేయడానికి 23 బంతులు తీసుకున్న మిల్లర్ మిగతా 50 పరుగులను మరో 12 బంతుల్లోనే చేయడం విశేషం. బంగ్లాదేశ్ బౌలర్ సైఫుద్దీన్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో ఏకంగా డేవిడ్ మిల్లర్ ఐదు సిక్సర్లు బాదాడు. తొలి ఐదు బంతులను సిక్సర్లు మలిచిన మిల్లర్ ఆరో బంతికి మాత్రం సింగిల్ తీశాడు.

టీ20ల్లో డేవిడ్ మిల్లర్‌కు ఇది తొలి సెంచరీ కావడం విశేషం. అంతర్జాతీయ క్రికెట్‌లో రిచర్డ్ లెవీ 45 బంతుల్లో చేసిన సెంచరీయే ఇప్పటివరకు టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ. కానీ ఇప్పుడు డేవిడ్ మిల్లర్ ఆ రికార్డుని బద్దలు కొట్టాడు. అంతేకాదు టీ20ల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన ఐదో సఫారీ ఆటగాడిగా కూడా నిలిచాడు.
ఈ మ్యాచ్‌లో ఓపెనర్ హషీం ఆమ్లా (51 బంతుల్లో 85, 11 ఫోర్లు, 1 సిక్స్) ఇచ్చిన చక్కటి ఆరంభానికి తోడు డేవిడ్ మిల్లర్ (36 బంతుల్లో 101 నాటౌట్, 7 ఫోర్లు, 9 సిక్సర్లు) దూకుగా ఆడటంతో దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 224 పరుగులు సాధించింది.