
లండన్: ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ మూడో బిడ్డకు తండ్రి అయ్యారు. ఆయన భార్య క్యాండిస్ వార్నర్ ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆ పాపకు అప్పుడే పేరు కూడా పెట్టేశారు వార్నర్ దంపతులు. ఆ పసిగుడ్డుకు ఇస్లా రోజ్ అని నామకరణం చేశారు. డేవిడ్ వార్నర్, క్యాండిస్ వార్నర్‌కు ఇదివరకే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వారి పేర్లు ఇవీ మే, ఇండీ రే. ఆస్ట్రేలియా జట్టు తరఫున డేవిడ్ వార్నర్ ప్రస్తుతం ఇంగ్లండ్‌లో కొనసాగుతున్న ప్రపంచకప్ టోర్నమెంట్‌లో ఆడుతున్న విషయం తెలిసిందే.
నెలలు నిండి, పురుడు పోసుకోవడానికి తేదీ దగ్గర పడటంతో కిందటి వారమే డేవిడ్ వార్నర్ తన భార్య, ఇద్దరు కుమార్తెలను లండన్‌కు పిలిపించుకున్నారు. దీనికోసం ఆయన క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు అనుమతి తీసుకున్నారు. కొంతకాలంగా క్యాండిస్ వార్నర్, పిల్లలు లండన్‌లో ఉంటున్నారు. ఆదివారం రాత్రి 10:30 నిమిషాలకు- లండన్‌లోని ఆసుపత్రిలో క్యాండిస్..ఆడబిడ్డకు జన్మనిచ్చారు. దీనికి సంబంధించిన ఓ ఫొటోను డేవిడ్ వార్నర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.