
దక్షిణాప్రికా స్టార్ క్రికెటర్ క్వింటన్ డికాక్ తండ్రి అయ్యాడు. అతని భార్య సాశా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అంతే కాకుండా తమ కూతురికి అప్పుడే నామకరణం కూడా చేసేశారు ఈ దంపతులు. కియారా అని పేరు పెట్టారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను డికాక్ దంపతులు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ ఫోటోలలో డికాక్ తన కూతురిని చేతిలోకి తీసుకుని ఎదలకు దగ్గరగా ఉంచుకుని అప్యాయంగా తన వైపే చూస్తున్నాడు. డికాక్ భార్య సాషా కూడా ఈ ఫోటోలో ఉంది. దీంతో అభిమానులతోపాటు పలువురు క్రికెటర్లు డికాక్ దంపతులకు అభినందనలు తెలుపుతున్నారు. ఐపీఎల్ ప్రాంచైజీ అయినా ముంబై ఇండియన్స్ కూడా ఇందుకు సంబంధించిన ఫోటోలను తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి అభినందనలు తెలిపింది. కాగా వికెట్ కీపర్ అయినా డికాక్ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాదికి తమ రిటెన్షన్ జాబితాలో ముంబై ఇండియన్స్ డికాక్ పేరును చేర్చలేదు.
కాగా భార్య డెలివరీ కారణంగా క్వింటన్ డికాక్ ఆమెతో ఎక్కువ సమయం గడపాడానికి ఏకంగా టెస్టు క్రికెట్‌కే రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత్‌తో తొలి టెస్టు మ్యాచ్‌లో ఆడిన డికాక్.. మ్యాచ్ ముగిసిన అనంతరం ఎవరూ ఊహించని రీతిలో అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ షాక్‌కు గురి చేశాడు. మొదట భారత్‌తో మిగతా రెండు టెస్టులకు దూరంగా ఉంటున్నట్టు ప్రకటించినప్పటికీ ఆ తర్వాత నిర్ణయం మార్చుకున్నాడు. ఇప్పటికే దిగ్గజాల రిటైర్మెంట్‌తో బలహీనంగా మారిన సౌతాఫ్రికాను డికాక్ వీడ్కోలు మరింత నిరాశకు గురిచేసింది. దీంతో పలువురు అభిమానులతోపాటు మాజీలు కూడా డికాక్‌ను రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు.
తన టెస్టు కెరీర్‌లో 54 టెస్టు మ్యాచ్‌లు ఆడిన డికాక్ 38 సగటుతో 3,300 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 141 పరుగులు. టెస్టు కెరీర్‌లో వికెట్ కీపర్‌గా డికాక్ 232 మందిని ఔట్ చేశాడు. ఇందులో 221 మందిని క్యాచ్‌ల ద్వారా, 11 మందిని స్టంపింగ్ ద్వారా ఔట్ చేశాడు.