పాకిస్తాన్ సైన్యం ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో జరిపిన అమానుష వైమానిక దాడుల్లో ముగ్గురు యువ క్రికెటర్లు ప్రాణాలు కోల్పోవడంతో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనపై ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ కెప్టెన్ రషీద్ ఖాన్ తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ చర్యను పూర్తిగా అనైతికంగా, అమానుషంగా ఆయన అభివర్ణించారు.
పాకిస్తాన్ వైమానిక దాడులు.. క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం
పాకిస్తాన్ సరిహద్దు వెంబడి జరిగిన వైమానిక దాడుల్లో పౌరులు, ముఖ్యంగా ముగ్గురు యువ క్రికెటర్లు మరణించిన నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతూ.. వచ్చే నెలలో పాకిస్తాన్, శ్రీలంకతో కలిసి జరగాల్సిన ట్రై-సిరీస్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. ఈ ఘటన నేపథ్యంలో నవంబర్ 5 నుంచి 29 వరకు లాహోర్, రావల్పిండిలలో జరగాల్సిన ఈ ట్రై-సిరీస్ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయంతో అనిశ్చితిలో పడింది. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ దాడిని పాకిస్తాన్ ప్రభుత్వం చేసిన పిరికిపంద దాడిగా తీవ్రంగా ఖండించింది.

ఉరుగున్‌లో విషాదం.. ముగ్గురు యువ క్రికెటర్లు మృతి
ఈ దారుణం ఆఫ్ఘనిస్తాన్‌లోని పక్టికా ప్రావిన్స్‌లోని పౌర నివాసాలపై జరిగిన దాడుల్లో చోటుచేసుకుంది. మరణించిన ఆ ముగ్గురు యువ ఆటగాళ్లను కబీర్, సిబ్‌గతుల్లా, హారూన్‌గా గుర్తించారు. ఈ యువ క్రికెటర్లు పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలోని తూర్పు పక్టికా ప్రావిన్స్, ఉరుగున్ నుంచి షార్నా వరకు ఒక ఫ్రెండ్లీ మ్యాచ్‌లో పాల్గొని ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో, ఉరుగున్‌లో జరుగుతున్న ఓ సభను పాకిస్తాన్ సైన్యం లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడిలో ఆ ముగ్గురు క్రికెటర్లతో పాటు మరో 5గురు పౌరులు కూడా మరణించారు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు దీనిని ఆఫ్ఘన్ క్రీడా సమాజానికి దాని ఆటగాళ్లకు, క్రికెట్ కుటుంబానికి తీరని నష్టంగా పేర్కోంది.
కాల్పుల విరమణ ఉల్లంఘన
48 గంటల కాల్పుల విరమణ తర్వాత మళ్లీ ప్రారంభమైన ఈ పోరాటం.. రెండు వైపులా చాలా మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైంది. పాకిస్తాన్ వైమానిక దాడుల్లో పక్టికా ప్రావిన్స్‌లోని అర్జున్, బర్మల్ జిల్లాలోని నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంది. సంక్షోభాన్ని తగ్గించడానికి రెండు దేశాల ప్రతినిధులు దోహాలో చర్చలు జరుపుతున్నప్పటికీ.. శుక్రవారం అర్థరాత్రి జరిగిన ఈ దాడులు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయని తాలిబాన్ తీవ్రంగా ఆరోపించింది.
ఆఫ్ఘన్ కెప్టెన్ రషీద్ ఖాన్ ఆగ్రహావేశాలు
ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ సోషల్ మీడియా ద్వారా తన తీవ్ర దుఃఖాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆయన ప్రకటనలో పౌరులు, మహిళలు, పిల్లలు, దేశానికి ప్రాతినిధ్యం వహించాలని కలలు కంటున్న యువ క్రికెటర్లు ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
"పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం పూర్తిగా అనైతికం, అమానుషం. ఈ అన్యాయమైన, చట్టవిరుద్ధమైన చర్యలు మానవ హక్కులను తీవ్రంగా ఉల్లంఘించాయి. వీటిని విస్మరించకూడదు." అని రషీద్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ దాడులను తీవ్రంగా విమర్శించిన రషీద్ ఖాన్.. ఈ మానవ హక్కుల తీవ్ర ఉల్లంఘనలను అంతర్జాతీయ వేదికపై లేవనెత్తాలని డిమాండ్ చేశారు. అమాయక ప్రాణాలు కోల్పోవడానికి కారణమైనందుకు, రాబోయే మ్యాచ్‌ల నుండి వైదొలగాలని ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని తాను పూర్తిగా స్వాగతిస్తున్నట్లు రషీద్ ఖాన్ సమర్థించారు. "ఈ కష్ట సమయంలో నేను నా ప్రజలకు అండగా ఉంటాను. మా జాతీయ గౌరవం ముందు ఉండాలి" అని ఆయన ప్రకటించారు.
ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని కెప్టెన్ రషీద్ ఖాన్ సమర్థించడంతో, అంతర్జాతీయ క్రికెట్ వేదికపై పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది.