
తరోబా (ట్రినిడాడ్): వెటరన్ వెస్టిండీస్ క్రికెటర్, మాజీ కెప్టెన్ డారెన్ సామీ అరుదైన ఘనతను అందుకున్నాడు. టీ20 క్రికెట్ చరిత్రలో 100 మ్యాచ్‌లు గెలిచిన కెప్టెన్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. దీంతో భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తర్వాత టీ20 క్రికెట్ చరిత్రలో 100 మ్యాచ్‌లు గెలిచిన సారథిగా నిలిచాడు. ఆదివారం గత సీజన్ రన్నరప్ గయాన అమెజాన్ వారియర్స్‌పై సెయింట్ లూసియా జౌక్స్ విజయం సాధించడంతో.. సామీ ఖాతాలో ఈ రికార్డు చేరింది.
డారెన్ సామీ పలు దేశాల్లోని టీ20 లీగ్‌లలో కెప్టెన్‌గా వ్యవహరించాడు. పెషావర్ జల్మి, రాజ్‌షాహి కింగ్స్, సెయింట్ లూసియా, సెయింట్ లూసియా స్టార్స్, సెయింట్ లూసియా జూక్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, టైటాన్స్, వెస్ట్ ఇండియన్స్, వెస్టిండీస్, వెస్టిండీస్ ఎలెవన్, మరియు విండ్‌వార్డ్ దీవులకు సామీ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. సామీ 200 టీ20 మ్యాచులకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. మరోవైపు ఎంఎస్ ధోనీ 270 మ్యాచ్‌ల్లో 160 విజయాలతో కెప్టెన్‌గా అగ్రస్థానంలో నిలిచాడు. భారత్, చెన్నై సూపర్ కింగ్స్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ జట్లకు మహీ సారథిగా బాధ్యతలు నిర్వహించాడు.
ఈ జాబితాలో భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మూడో స్థానంలో నిలిచాడు. గౌతీ 170 మ్యాచ్‌లలో 98 విజయాలు అందుకున్నాడు. అయితే గంభీర్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆ రికార్డును మెరుగుపర్చడానికి ఇక అవకాశం లేదు. రాబోయే ఐపీఎల్ 2020లో ఎంఎస్ ధోనీ మరిన్ని విజయాలు అందుకుని ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచే అవకాశం ఉంది. అత్యధిక ఐపీఎల్ ట్రోఫీలు నెగ్గిన రోహిత్ శర్మ 128 మ్యాచ్‌ల్లో 79 విజయాలతో ఐదో స్థానంలో ఉన్నాడు. అయితే కెప్టెన్‌గా 100కి పైగా టీ20 మ్యాచ్‌ల్లో పాల్గొన్న 14 మంది ఆటగాళ్లలో సామీ విజయ శాతం 51.79గా (8వ స్థానం) ఉంది. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ 66.96%తో అగ్రస్థానంలో ఉన్నాడు.
సీపీఎల్ 2020 సీజన్‌లో గయాన అమెజాన్ వారియర్స్‌కు గట్టి షాక్ తగిలింది. సెయింట్ లూసియా జౌక్స్‌తో సోమవారం తెల్లవారు జామున జరిగిన మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. లీగ్‌లో గయానకు ఇది రెండో పరాజయం కాగా.. సెయింట్ లూసియాకు మూడో విజయం. బ్యాటింగ్‌లో ఆ జట్టు బ్యాట్స్‌మన్ రోస్టన్ ఛేజ్(51 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 66) విధ్వంసం సృష్టించగా.. బౌలింగ్‌లో స్కాట్ కుగ్గెలీజ్న్ (3/24) ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను చెడుగుడు ఆడటంతో సెయింట్ లూసియా అలవోక విజయాన్నందుకుంది. డారెన్ సామీ డకౌట్ అయ్యాడు.