
దక్షిణాఫ్రికాతో జరగబోయే టీ20 సిరీస్‌లో టీమిండియా ఆల్రౌండర్, ఐపీఎల్ విన్నింగ్ కెప్టెన్, గుజరాత్ టైటాన్స్ సారథి హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ ఆర్డర్ విషయమై న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ డానియెల్ వెటోరీ కీలక సూచనలు చేశాడు. హార్దిక్ పాండ్యా 4వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగాలని సూచించాడు. పాండ్యాకు ఇది సరైన స్థానమని వెటోరీ అభిప్రాయపడ్డాడు. టీమిండియా మేనేజ్‌మెంట్ కూడా దీనిపై ఆలోచించాలని సూచించాడు.
ఇకపోతే టీమిండియా 4వ స్థానం కోసం రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్‌లను టీమిండియా మేనేజ్ మెంట్ చాలా సార్లు పరీక్షించిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పటివరకు స్థిరమైన నంబర్ 4 బ్యాటింగ్ ఆర్డర్ ప్లేయర్ మాత్రం లేడు. అయితే కీలకమైన మిడిల్ ఆర్డర్ స్లాట్‌లో ఎవరు బ్యాటింగ్ చేయాలనే దానిపై ఇంకా కసరత్తు జరుగుతుంది.
ఇక డానియెల్ వెటోరీ మాట్లాడుతూ.. 'మీరు అతనిని నంబర్ 4లో ఆడించాలని అనుకుంటే తప్పకుండా ఆ పని చేయండి. హార్దిక్ పాండ్యాకు నాలుగో స్థానం సరైనది. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ ఆ స్థానంలో ఆడుతున్నాడనుకుంటా. సూర్యకుమార్ యాదవ్‌ను నంబర్ 5లో ఆడిస్తే మేలనుకుంటా. ఇదే జరిగితే రిషబ్ పంత్ ఆరోస్థానంలో బరిలోకి దిగే అవకాశముంటుంది.' అని వెటోరీ ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫోకి తెలిపాడు.
దక్షిణాఫ్రికా సిరీస్ కోసం హార్దిక్ పాండ్యా తిరిగి భారత జట్టులోకి రాబోతున్న తరుణంలో వెటోరీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇకపోతే గుజరాత్ టైటాన్స్ తరఫున హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో, బ్యాటింగ్‌లో అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే. పాండ్య సీజన్‌లో 131.26 స్ట్రైక్ రేట్‌తో 487 పరుగులు చేసి ఎనిమిది వికెట్లు పడగొట్టాడు.
ఇకపోతే ఈ ఏడాది అక్టోబర్లో టీ20 ప్రపంచ కప్ జరగనున్న తరుణంలో టీమిండియా మేనేజ్‌మెంట్ జట్టు కూర్పును సరిదిద్దాలని చూస్తోంది. దక్షిణాఫ్రికాతో జరగనున్న స్వదేశీ సిరీస్ నుంచే జట్టులో సమతూకం తేవడానికి ప్రణాళికలు రచిస్తోంది. జూన్ 9నుండి దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ భారత ఆడనుంది. ఇకపోతే ఈ సిరీస్లో భారత పేస్ విభాగంలో ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్ లాంటి ప్లేయర్లు కూడా తన లక్‌ను పరీక్షించుకోనున్నారు. దినేష్ కార్తీక్, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా తిరిగి టీ20 జట్టులో స్థానం సంపాదించి రాణించడానికి రెడీగా ఉన్నారు.