
హైదరాబాద్: ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ఫాస్ట్ బౌలర్ల జాబితాలో ఒకడిగా పేరు తెచ్చుకున్న దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ బుధవారం(జూన్ 27న) 35వ పుట్టినరోజుని జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా డేల్ స్టెయిన్‌కు మాజీ క్రికెటర్లతో పాటు ప్రస్తుత క్రికెటర్లు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
2004లో ఇంగ్లాండ్‌పై టెస్టు అరంగేట్రం చేసిన స్టెయిన్ అతి తక్కువ కాలంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నాడు. తన 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో సఫారీ జట్టు తరుపున ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. అయితే, ఇటీవల కాలంలో వరుస గాయాలతో జట్టుకు దూరమయ్యాడు.
క్రికెట్ కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లను సాధించిన డేల్ స్టెయిన్ టెస్టుల్లో మరో మూడు వికెట్లు తీస్తే, దక్షిణాఫ్రికా తరుపున అత్యధిక టెస్టు వికెట్లు సాధించిన ఆటగాడిగా అరుదైన రికార్డుని నెలకొల్పనున్నాడు. దక్షిణాఫ్రికా తరుపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు(421) సాధించిన రికార్డు షాన్ పొలాక్ పేరిట ఉంది.
ఈ రికార్డును శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్‌లో డేల్ స్టెయిన్ తిరగరాస్తాడని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు ఎంపికైన అనంతరం డేల్ స్టెయిన్ మాట్లాడుతూ "నా టార్గెట్ 100 టెస్టులు, 500 వికెట్లు , 2019 ప్రపంచకప్" అని పేర్కొన్నాడు.
వయసుతో సంబంధం లేకుండా తన లక్ష్యం పూర్తి చేసేవరకు క్రికెట్‌లో కొనసాగుతానని డేల్ స్టెయిన్ స్పష్టం చేశాడు. తాను సాధించాల్సిన లక్ష్యాలకు గాయాలు అడ్డంకి కాదని, గాయంతో జట్టుకు దూరమైనప్పుడు మరింత ఉత్తేజంతో తిరిగి జట్టులోకి వస్తానని అన్నాడు.