
హైదరాబాద్: సెంచూరియన్ వేదికగా పాకిస్థాన్‌తో బుధవారం ప్రారంభమైన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో డేల్ స్టెయిన్(422) దక్షిణాఫ్రికా తరుపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు.
అంతకముందు ఈ రికార్డు మాజీ బౌలర్ షాన్ పొల్లాక్(421) పేరిట ఉంది. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా తొలి టెస్టు బుధవారం ప్రారంభమైంది. పాక్ ఓపెనర్ ఫకార్ జమాన్(12)ను ఔట్ చేయడం ద్వారా డేల్ స్టెయిన్ ఈ ఘనత సాధించాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తొలి రోజు లంచ్ విరామం అనంతరం డేల్ స్టెయిన్ మాట్లాడుతూ "ఈ రికార్డు కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నా. ఈ రికార్డు కోసం గత రెండు సంవత్సరాలుగా నన్ను అడుగుతున్నారు. ఇప్పుడు సాధించా" అని అన్నాడు.
"ఇప్పటికే ఎన్నో వికెట్లు సాధించా. అయితే, ఈ ఒక వికెట్ కోసం చాలా ఎదురు చూశా. ఈరోజుకు ఇదే నాకు పెద్ద గోల్. చివరకు ఈ వికెట్ తీసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి గొప్ప గౌరవాన్ని పొందడం గొప్ప అనుభూతి. రికార్డు వికెట్ తీసిన తర్వాత నా మార్క్ చూపించా. మళ్లీ ఇంకొ వికెట్ కోసం ప్లాన్ చేశా" అని స్టెయిన్ అన్నాడు.
గాయం కారణంగా గత మూడేళ్లలో డేల్ స్టెయిన్ కేవలం ఆరు టెస్టులు మాత్రమే ఆడాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకుని తిరిగి జట్టులో చోటు దక్కించుకోవడంపై డేల్ స్టెయిన్ మాట్లాడుతూ గాయం యొక్క తీవ్రత చాలా మందికి తెలియదని పేర్కొన్నాడు. తిరిగి జట్టులో చోటు దక్కించుకోవడానికి కుటుంబ సభ్యులు, స్నేహితులే కారణమని అన్నాడు.
ప్రస్తుతం టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో డేల్ స్టెయిన్ 11వ స్థానంలో కొనసాగుతున్నాడు. సఫారీ జట్టు తరుపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన డేల్ స్టెయిన్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.