ఆ కవర్ డ్రైవ్ చూడటానికి వెయిటింగ్: సౌరవ్ గంగూలీ
ఇండియన్ క్రికెట్ హిస్టరీలో దూకుడు గల కెప్టెన్ గా పేరొందిన దాదా సౌరవ్ గంగూలీ బయోపిక్ గురించి ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఓ భారీ సర్‌ప్రైజ్ లభించింది. నేడు(జులై 8) సౌరవ్ గంగూలీ తన 54వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన జీవత కథ ఆధారంగా తెరకెక్కుతున్న 'దాదా-ది సౌరవ్ గంగూలీ స్టోరీ' బయోపిక్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం అధికారికంగా విడుదల చేసింది. ఈ సినిమాలో గంగూలీ పాత్రను బాలీవుడ్ విలక్షణ నటుడు రాజ్ కుమార్ రావు పోషిస్తున్నారు.
ఈ బయోపిక్ ఫస్ట్ లుక్ పోస్టర్ నెట్టింట వైరల్‌గా మారడంతో పాటు స్వయంగా సౌరవ్ గంగూలీ దృష్టిని ఆకర్షించింది. పోస్టర్ ను చూసిన గంగూలీ ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. దీనిని తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్లో షేర్ చేస్తూ.. "ఇప్పటివరకు నా జీవితంలో లభించిన అత్యుత్తమ బర్త్ డే గిఫ్ట్ ఇదే " అంటూ గంగూలీ పేర్కొనడం విశేషం. అంతే కాకుండా నటుడు రాజ్ కుమార్ రావును ట్యాగ్ చేస్తూ.. "స్టేడియంలో నా కవర్ డ్రైవ్ షాట్ ను మీరు వెండితెరపై ఎలా ఆడారో చూసేందుకు ఆతృతగా వేచి ఉన్నాను" అంటూ చిత్ర బృందాన్ని ప్రశంసల్లో ముంచెత్తారు.

తాజాగా విడుదలైన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లో ఓ అద్భుతమైన చారిత్రాత్మక క్షణాన్ని రీక్రియేట్ చేశారు. 2002 నాటి లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ బాల్కనీలో సౌరవ్ గంగూలీ జెర్సీ విప్పి గాల్లో ఊపుతూ వేడుక చేసుకున్న ఐకానిక్ సీన్‌ను రాజ్ కుమార్ రావు లుక్ తో పోస్టర్ గా డిజైన్ చేశారు. ఈ లుక్ క్రికెట్ ప్రేమికులకు పాత జ్ఞాపకాలకు గుర్తు చేస్తోంది. భారత క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే క్షణాల్లో ఇది ఒకటి కావడం విశేషం.
నిజానికి 2002లో ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన ప్రతిష్ఠాత్మక నాట్‌వెస్ట్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ భారత క్రికెట్ గమనాన్ని మార్చేసింది. ఆ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు నిర్దేశించిన 326 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. అసాధ్యమనుకున్న ఆ మ్యాచ్ లో యువరాజ్ సింగ్, మహమ్మద్ కైఫ్ లు అద్భుత పోరాటంతో జట్టును గెలిపించారు. విజయం ఖరారు కాగానే అప్పటి కెప్టెన్ గంగూలీ లార్డ్స్ బాల్కనీలో తన టీ షర్ట్ విప్పి గాల్లో తిప్పుతూ ఇంగ్లాండ్ జట్టుకు ధీటైన సమాధానమిచ్చాడు. ఈ మ్యాచ్, ఆ తర్వాత జరిగిన పరిణామాలే 'దాదా' బయోపిక్ లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
ఈ సినిమా పక్కా స్పోర్ట్స్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కోల్‌కతాకు చెందిన ఓ సాధారణ యవకుడు భారత క్రికెట్ జట్టులోకి ఎలా ప్రవేశించాడు? ఆ తర్వాత జట్టును ఏ విధంగా ముందుకు నడిపించి సక్సెస్ ఫుల్ కెప్టెన్‌గా ఎలా ఎదిగాడనే విషయాలను ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ప్రముఖ దర్శకుడు విక్రమాదిత్య మోత్వాని దర్శకత్వం వహిస్తుండగా.. లవ్ రంజన్, అంకుర్ గార్గ్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది అంటే 2027 మే 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications