ముంబై: ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్‌లో భాగంగా ముంబైలోని వాంఖెడే స్టేడియంలో తొలి సెమీ ఫైనల్స్ రసవత్తరంగా కొనసాగుతోంది. టీమిండియా టాస్ గెలిచి.. తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ కీలకంగా మారిన ఈ మ్యాచ్‌లో.. అందరి అంచనాలకు తగ్గట్టుగానే తొలుత బ్యాటింగ్‌కే మొగ్గు చూపాడు కేప్టెన్ రోహిత్ శర్మ.
బ్యాటింగ్‌కు దిగిన భారత్.. దూకుడుగా ఇన్నింగ్ ఆరంభించింది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో పరుగులకు గేట్లెత్తింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ శుభారంభాన్ని ఇచ్చారు. భారీ షాట్లతో న్యూజిలాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఓవర్‌కు ఎనిమిది చొప్పున రన్‌రేట్‌తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు.

9వ ఓవర్‌లో రోహిత్ శర్మ వికెట్‌ను కోల్పోయింది భారత్. ఆ ఓవర్ రెండో బంతిని స్లోవర్ డెలివరీగా సంధించాడు సౌథీ. దీన్ని బారీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు రోహిత్. కాస్త ఎర్లీగా బ్యాట్‌ను ఝుళిపించాడు. మిడాఫ్ దిశగా గాల్లోకి ఎగిరిన ఈ బంతిని న్యూజిలాండ్ కేప్టెన్ కేన్ విలియమ్సన్ అద్భుతంగా అందుకున్నాడు. వెనక్కి పరుగెత్తుతూ వెనక్కి డైవ్ చేస్తూ బాల్‌ను పట్టాడు.
దీనితో 71 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది భారత్. 29 బంతుల్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 47 పరుగులు చేశాడు రోహిత్ శర్మ. 162.7 స్ట్రైక్‌రేట్‌ను నమోదు చేశాడీ హిట్ మ్యాన్. తృటిలో హాఫ్ సెంచరీని మిస్ అయ్యాడు. ప్రస్తుతం శుభ్‌మన్ గిల్, టాప్ ఆర్డర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ క్రీజ్‌లో ఉన్నారు.
ఈ క్రమంలో మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ సెమీ ఫైనల్స్‌లో తొలి అర్ధసెంచరీ అతనిదే. 40 బంతుల్లో అతని అర్ధసెంచరీ పూర్తయింది. రచిన్ రవీంద్ర లో- ఫుల్‌టాస్ సంధించిన 14వ ఓవర్ మూడో బంతిని లాంగాఫ్ దిశగా తరలించడంతో అతని అర్ధసెంచరీ ముగిసింది. చివరి నాలుగు మ్యాచ్‌లల్లో అతను అందుకున్న చేసిన మూడో హాఫ్ సెంచరీ ఇది.
స్టాండ్స్‌లో ఈ మ్యాచ్‌ను తిలకిస్తోన్న సారా టెండుల్కర్.. గిల్ హాఫ్ సెంచరీ పూర్తయిన వెంటనే ఎగిరి గంతేసింది. పక్కనే ఉన్న తన స్నేహితురాలితో ఆనందాన్ని పంచుకుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ అతన్ని ఎంకరేజ్ చేసింది. వీరిద్దరూ లవర్స్ అనే విషయం తెలిసిందే.