ముంబై: ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్‌లో భాగంగా ముంబైలోని వాంఖెడే స్టేడియంలో తొలి సెమీ ఫైనల్స్ మొదలైంది. టీమిండియా టాస్ గెలిచింది. తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ కీలకంగా మారిన ఈ మ్యాచ్‌లో.. అందరి అంచనాలకు తగ్గట్టుగానే తొలుత బ్యాటింగ్‌కే మొగ్గు చూపాడు కేప్టెన్ రోహిత్ శర్మ.
అనంతరం రోహిత్ శర్మ మాట్లాడాడు. పిచ్ బాగుందని కితాబిచ్చాడు. మ్యాచ్ కొనసాగుతున్న కొద్దీ మందకొడిగా మారొచ్చని అంచనా వేశాడు. ఇంగ్లాండ్‌లో 2019 నాటి సెమీ ఫైనల్స్ తనకు గుర్తుకు వస్తోందని, ఇదే న్యూజిలాండ్‌తో గట్టిగా పోరాడామని వ్యాఖ్యానించాడు. న్యూజిలాండ్‌ను ఏ మాత్రం తక్కువగా అంచనా వేయట్లేదని, కొన్ని సంవత్సరాలుగా నిలకడగా రాణిస్తోన్న జట్టుగా గుర్తింపు ఉందని చెప్పాడు ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందని అభిప్రాయపడ్డాడు.

అతని అంచనాలు ఏ మాత్రం తప్పు కాలేదు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో పరుగులకు గేట్లెత్తేశారు. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ధాటిగా ఆడుతున్నారు. పిడుగుల్లాంటి షాట్లతో న్యూజిలాండ్ బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. మరోసారి భారత్ భారీ స్కోర్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది ఈ దూకుడు చూస్తోంటే.
తొలి అయిదు ఓవర్లల్లో వికెట్ నష్టపోకుండా 47 పరుగులు పిండుకున్నారు ఓపెనర్లిద్దరూ కలిసి. ఇందులో రోహిత్ శర్మ వాటా ఎక్కువ. 18 బంతుల్లో మూడు చొప్పున ఫోర్లు, సిక్సర్లతో 34 పరుగులు చేశాడు. గిల్ 12 బంతుల్లో రెండు ఫోర్లతో11 పరుగుల మీద ఆడుతున్నాడు.
స్టేడియంలో విక్టరీ వెంకటేష్ సందడి చేశాడు. ఈ మ్యాచ్ కోసం ఆయన ముంబై వెళ్లారు. వెస్టిండీస్ లెజెండరీ ప్లేయర్ వివియన్ రిచర్డ్స్‌తో కలిసి మ్యాచ్ చూడటం కనిపించింది. ఆయనతో ఓ సెల్ఫీ సైతం దిగారు వెంకీమామ. క్రికెట్ మ్యాచ్‌లంటే వెంకటేష్ ఎంతగానో ఇష్టపడతాడనే విషయం తెలిసిందే.
వరల్డ్ కప్‌లో భాగంగా టీమిండియా ఆడిన మొట్టమొదటి మ్యాచ్‌కు సైతం అటెండ్ అయ్యాడు వెంకి మామ. చెన్నై చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌ను ప్రత్యక్షంగా తిలకించాడు. ప్రస్తుతం సైంధవ్లో నటిస్తోన్నారు వెంకటేష్. ఇది వెంకటేష్‌కు 75వ సినిమా. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తోన్నారు. 2024 జనవరి 13వ తేదీన విడుదల కానుంది.