
వరుసగా ఓటములలో కూరుకుపోయిన దక్షిణాఫ్రికాకు మిగిలిన ఆరు మ్యాచ్‌లు నాకౌట్‌తో సమానమని ఆ జట్టు మాజీ ఆల్‌రౌండర్ జాక్వెస్ కలిస్ పేర్కొన్నాడు. మరోవైపు ప్రపంచకప్-2019 టోర్నీలో భారత జట్టే అసలైన పోటీదారని కలిస్ అభిప్రాయపడ్డాడు. ప్రపంచకప్‌లో ఈసారి దక్షిణాఫ్రికాపై అంచనాలు కొంచెం తక్కువే ఉన్నాయి. కానీ.. ఆ జట్టు వాటిని కూడా అందుకోలేకపోయింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిన సఫారీ జట్టు సెమీస్ అవకాశాల్ని టోర్నీ ఆరంభ దశలోనే సంక్లిష్టం చేసుకుంది. బంగ్లా చేతిలో ఓడాక భారత్‌తో మ్యాచ్‌లో మాత్రం పోటీ ఇచ్చింది. బౌలర్లు విజయవంతం అయినా.. బ్యాట్స్‌మన్ చేతులెత్తేయడంతో సఫారీలకు ఓటమి తప్పలేదు. తాజాగా ఈ ఓటములపై కలిస్ స్పందించాడు.
కలిస్ ఐసీసీకి రాసిన ప్రత్యేక కాలమ్‌లో పలు అంశాలను ప్రస్తావించాడు. 'టోర్నీలో దక్షిణాఫ్రికా పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఇంగ్లండ్, భారత్ ఓటములు అంతగా ఆశ్చర్యం కల్గించలేదు. కానీ.. బంగ్లాదేశ్ చేతిలో ఓటమి జట్టులో లోపాలను తెలుపుతుంది. దక్షిణాఫ్రికాకు మిగిలిన ఆరు మ్యాచ్‌లు నాకౌట్‌తో సమానం. మెరుగైన ప్రదర్శన చేయాలి. టోర్నీలో భారత్ ప్రధానమైన పోటీదారుగా భావిస్తున్నా. సఫారీలతో మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన చేశారు' అని కలిస్ తెలిపారు.
ప్రపంచకప్ 2019ను రౌండ్ రాబిన్ పద్దతిలో నిర్వహిస్తున్నారు. సెమీస్‌కు అర్హత సాధించాలంటే ఆరు విజయాలు అవసరం. ఇప్పటికే ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, భారత్ జట్లపై వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిన దక్షిణాఫ్రికా.. సెమీస్ చేరాలంటే చివరి ఆరు మ్యాచ్‌లలో విజయం సాదించాలి. దక్షిణాఫ్రికా తదుపరి మ్యాచ్‌లలో పటిష్ట జట్లు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్, పాకిస్థాన్‌లతో తలపడనుంది. వీటిని ఓడించడం అంత సులువు కాదు. ఈ అడ్డంకుల్ని దాటి సఫారీ జట్టు సెమీస్ చేరడం కష్టమే. ఆరు మ్యాచ్‌లు గెలిస్తే సెమీస్ నేరుగా చేరొచ్చు. ఒకటి, రెండు మ్యాచ్‌లు ఓడితే.. ఐపీఎల్-12 మాదిరి ఏదైనా అద్భుతం జరిగితే తప్ప దక్షిణాఫ్రికా సెమీస్ చేరే అవకాశాలు లేవు.