
నాటింగ్‌హామ్ వేదికగా మరికాసేపట్లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. టీమిండియా రెగ్యులర్ ఓపెనర్ శిఖర్ ధావన్ గాయంతో దూరమవగా.. ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ బరిలోకి దిగుతున్నాడు. ఓపెనర్‌గా రాహుల్ ఖాయమైపోవడంతో.. నాలుగో స్థానంలో ఎవరికి అవకాశం దక్కుతుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ధావన్ స్థానంలో స్టాండ్‌బైగా రిషబ్ పంత్ వెళ్లినా.. అతనేమీ మ్యాచ్ ఆడడు. ఆల్ రౌండర్ విజయ్ శంకర్ లేదా స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్ దినేశ్ కార్తీక్ బ్యాటింగ్‌కు దిగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం నాటింగ్‌హామ్ మైదానం తడిగా ఉంది. అక్కడ రెండు రోజులుగా వర్షం కురుస్తోంది. పిచ్ మీడియం పేసర్లకు అనుకూలించే అవకాశం ఉంది. దీంతో కివీస్‌తో మ్యాచ్‌లో విజయ్ శంకర్‌కు అవకాశం దక్కొచ్చు. మరోవైపు బుధవారం నెట్స్‌లో శంకర్ ఎక్కువసేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. ఇది కూడా అతను బరిలోకి దిగుతాడని సంకేతాలు ఇస్తోంది.
బలమైన బౌలింగ్ లైనప్ ఉన్న కివీస్‌ను ఢీకొట్టాలంటే సీనియర్ బ్యాట్స్‌మన్ దినేశ్ కార్తీక్ అవసరం. ఇక హెన్రీ, బౌల్ట్, ఫెర్గూసన్, నీషమ్‌లతో కూడిన పటిష్ఠమైన పేస్ అటాక్ ఎదుర్కోవాలంటే కార్తీక్ కరెక్ట్ చాయిస్. మొత్తంగా నాలుగో స్థానంలో స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ అయితేనే టీమిండియాకు అదనపు బలం కాబట్టి కార్తీక్‌ను ఎంపిక చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మరి కెప్టెన్ విరాట్ కోహ్లీ, జట్టు యాజమాన్యం ఎవరికి ఓటేస్తారో చూడాలి.
ఉదయం నుంచి భారీ వర్షం కురవడంతో నాటింగ్‌హామ్ మైదానం తడిగా ఉంది. దీంతో అంపైర్లు టాస్ నిలిపివేశారు. ప్రస్తుతానికి వర్షం లేకపోవడంతో టాస్ ఆలస్యంగా వేయనున్నారు. ఈ మెగా టోర్నీలో భారత్, న్యూజిలాండ్ జట్లూ ఇంతవరకు ఓటమిని చూడలేదు. న్యూజిలాండ్ హ్యాట్రిక్ విజయాలు కొట్టగా.. భారత్ రెండు విజయాలు అందుకుంది. మ్యాచ్ జరిగితే ఒక జట్టు తొలిసారి ఓటమి రుచిని చూడనుంది.