
ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో గాయపడ్డ టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్‌కి మూడు వారాల విశ్రాంతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో అతడి స్థానంలో ఎవరిని తీసుకుంటారా అని తీవ్ర చర్చ జరిగింది. చివరికి యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌ను భారత మేనేజ్మెంట్ ఇంగ్లాండ్‌కు పంపింది. అయితే ధావన్ స్థానంలో సీనియర్ ఆటగాడు అజింక్య రహానెను పంపిస్తే బాగుండేదని భారత మాజీ దిగ్గజం కపిల్ దేవ్ అభిప్రాయపడ్డారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
రిషభ్ పంత్‌ను ఎంపిక చేయడానికి ముందు కపిల్ తన అభిప్రాయం వెల్లడించారు. 'రహానె పేరు పరిగణనలోకి తీసుకుంటే తొలి ప్రాధాన్యం అతడికే ఇవ్వాలి. పంత్, అంబటి రాయుడుల కంటే అతడినే ఎంపిక చేయాలి. ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలు ఆడిన అనుభవం రహానెకు ఉంది. అతడు ఓపెనింగ్ చేయగలడు. మిడిలార్డర్‌లో ఆడగలడు' అని కపిల్ దేవ్ పేర్కొన్నారు.

'ధావన్ గాయం కారణంగా జట్టులో మార్పులు అవసరం. రాహుల్ నాలుగో స్థానంలో బాగా రాణిస్తున్నాడు. రహానెను జట్టులోకి తీసుకుంటే.. రాహుల్ ఎప్పటిలాగానే నాలుగో స్థానంలో, రహానె ఓపెనింగ్ చేసేవాడు. అప్పుడు జట్టు బ్యాటింగ్ లైనప్ బాగుండేది' అని కపిల్ పేర్కొన్నారు. ట్రెంట్‌బ్రిడ్జ్ మైదానం వేదికగా గురువారం భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. కివీస్ ఇప్పటికే ఆడిన మూడు మ్యాచులు గెలవగా.. భారత్ రెండు మ్యాచులు గెలుచింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.
ఇప్పటి వరకు భారత్, కివీస్ జట్లు మొత్తం 106 మ్యాచ్‌లు ఆడాయి. ఇందులో 55 భారత్ గెలవగా.. 45 న్యూజిలాండ్ గెలిచింది. ఒక మ్యాచ్ టై అయింది. ఫలితం తేలనివి 5 మ్యాచ్‌లు. ప్రపంచకప్‌లో మొత్తం 7 మ్యాచులు ఆడగా.. భారత్ 3.. న్యూజిలాండ్ 4 గెలిచాయి.