
హైదరాబాద్: తన గాయంపై టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ చేసిన ట్వీట్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. గత ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డ శిఖర్ ధావన్‌కు జట్టు యాజమాన్యం మంగళవారం స్కానింగ్ చేయించింది. దీంతో అతడి వేలి ఎముక చిట్లినట్టు తేలింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
గాయం తీవ్రత దృష్ట్యా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో అతడు సుమారు మూడు వారాల పాటు టోర్నీకి దూరం కావాల్సి వచ్చింది. ధావన్ ఎన్ని రోజులు ఆటకు దూరమవుతాడన్న విషయంలో బీసీసీఐకి కూడా స్పష్టత లేదు. కనీసం మూడు మ్యాచ్‌లకు ధావన్ దూరమవుతాడని వైద్యులు అంచనా వేస్తున్నారు.
టోర్నీలో భాగంగా గురువారం న్యూజిలాండ్‌తో, ఆదివారం పాకిస్థాన్‌తో, జూన్ 22న అఫ్గానిస్థాన్‌తో తలపడనుంది. అయితే, మూడు మ్యాచ్‌లకు మాత్రం ధావన్ అందుబాటులో ఉండడని బీసీసీఐ మాటలను బట్టి తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ధావన్ చేసిన ఓ ట్వీట్ క్రికెట్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.
డాక్టర్ రహత్ ఇందోరీ రాసిన ఓ పద్యాన్ని తన ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. ఆ పద్యం యొక్క అర్ధాన్ని బట్టి చూస్తే కోలుకుని వచ్చాక ధావన్ పరుగుల వరద పారిస్తానని పరోక్షంగా చెబుతున్నాడు. చిన్నచిన్న గాయాలు తన నమ్మకాన్ని సడలించలేవని అర్ధం వచ్చేలా ఆ పద్యం ఉంది. మరోవైపు ధావన్ స్థానాన్ని భర్తీ చేసేందుకు పంత్ ఇంగ్లండ్‌కు పయనమయ్యాడు.