ముంబై: ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్‌లో ప్రస్తుత ఛాంపియన్ ఇంగ్లాండ్ వరుస పరాజయాలతో కొట్టుమిట్టాడుతోంది. తొలి మ్యాచ్‌లోనే తన చిరకాల ప్రత్యర్థి న్యూజిలాండ్ చేతిలో మట్టికరిచిన అనంతరం కోలుకోలేకపోతోంది. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచిందా జట్టు.
ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లల్లో ఒక్కదాంట్లో మాత్రమే విజయం సాధించింది. మూడింట్లో దారుణ పరాజయాన్ని చవి చూసింది. చివరికి ఆఫ్ఘనిస్తాన్‌పైనా ఓటమి పాలవడం.. ఇంగ్లాండ్ అధ్వాన్నపు ఆటతీరుకు అద్దం పట్టినట్టయింది. ఈ టోర్నమెంట్‌లో మున్ముందు మరిన్ని కష్టాలను ఎదుర్కొనక తప్పని పరిస్థిితులు ఉన్నాయి ఇంగ్లాండ్‌కు.

తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఘోరంగా ఓటమిపాలైంది. రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై తిరుగులేని విజయం సాధించింది. తొమ్మిది వికెట్ల నష్టానికి 364 పరుగులు చేసి, బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించిన అనంతరం ఇంగ్లాండ్ గాడినపడిందనే అనుకున్నారు.. గానీ అది గాలివాటమేనని తేలింది. తన మూడో మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో, అనంతరం దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో చిత్తయింది.
దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ రీస్ టోప్లే (Reece Topley) గాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో తొలి వికెట్ పడగొట్టిన అర్ధాంతరంగా గ్రౌండ్‌ను వీడాడు. అతని ఎడమచేతి వేలికి గాయమైంది. వేలికి ఫ్రాక్చర్ అయినట్లు స్కానింగ్ రిపోర్ట్‌లో తేలింది. దీనితో అతనికి ఆరు వారాల పాటు విశ్రాంతి అవసరమని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ తెలిపింది.
రీస్ టోప్లే స్థానంలో మరో యంగ్ అండ్ డైనమిక్ ప్లేయర్‌కు చోటు కల్పించింది. ఫాస్ట్ బౌలర్ బ్రైడన్ కార్స్ (Brydon Carse), ను జట్టులోకి తీసుకుంది. 28 సంవత్సరాల బ్రైడన్ కార్స్ ప్రస్తుతం దుర్హమ్ తరఫున కౌంటీ మ్యాచ్‌లను ఆడుతున్నాడు. బౌలింగ్‌లో మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. బ్యాటింగ్ చేయగల సత్తా ఉంది. ఆల్ రౌండర్ కింద అతణ్ని ఎంపిక చేసింది ఈసీబీ.
బ్రైడన్ కార్స్ జన్మతః దక్షిణాఫ్రికన్. కేప్ టౌన్‌లో జన్మించాడు. అనంతరం అతని కుటుంబం ఇంగ్లాండ్‌కు వలస వెళ్లింది. అతని తండ్రి కూడా క్రికెటరే. జేమ్స్ అలెగ్జాండర్ కార్స్ జింబాబ్వే తరఫున ఆడాడు. బ్రైడన్ కార్స్ 2021 జులైలో ఇంగ్లాండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఇప్పటివరకు 14 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు బ్రైడన్. 14 వికెట్లను పడగొట్టాడు.
ఈ నెల 29వ తేదీన భారత్‌ను ఢీ కొట్టబోతోంది ఇంగ్లాండ్. అంతకంటే ముందు 26వ తేదీన శ్రీలంకతో తలపడుతుంది. శ్రీలంకతో మ్యాచ్ నాటికే బ్రైడన్ కార్స్.. జట్టుకు అందుబాటులోకి రానున్నాడు. భారత్‌తో తలపడే మ్యాచ్‌లో అతన్ని ఆడించడం ఖాయంగా కనిపిస్తోంది.